Vijaya Sai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేత విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేశారు. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకనుంచి వ్యవసాయం చేసుకుంటానని కూడా చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అదే సమయంలో ఆయన వరుస భేటీలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. కొద్దిరోజుల కిందట ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తో ఆయన సమావేశం అయిన సంగతి తెలిసిందే. మూడు గంటలపాటు ఆమెతో వివిధ అంశాలపై చర్చించారు. లోటస్ ఫండ్ లో షర్మిల తో కలిసి భోజనం కూడా చేశారు. ఇప్పుడు తాజాగా ఆయన నందమూరి కుటుంబంతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* తారకరత్న భార్య సమీప బంధువు
నందమూరి కుటుంబానితో( Nandamuri family) విజయసాయిరెడ్డికి బంధుత్వం ఉంది. నందమూరి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి విజయసాయి రెడ్డికి సమీప బంధువు. అలేఖ్య రెడ్డి తల్లి.. విజయసాయిరెడ్డి భార్య అక్కా చెల్లెలు. అలేఖ్య రెడ్డి కూతురు వరసన్నమాట. తారకరత్న ది ప్రేమ వివాహం. అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇందుకు ఇరు కుటుంబాలు అంగీకరించకపోవడంతో విజయసాయిరెడ్డి దగ్గరుండి వివాహం జరిపించారు అని చాలా సందర్భాల్లో అలేఖ్య రెడ్డి చెప్పుకొచ్చారు. బాబాయ్ విజయ్ సాయి రెడ్డి తమకు అండగా నిలిచారని కూడా చాలాసార్లు చెప్పారు.
* అప్పట్లో బాలకృష్ణతో కలిసి
తారకరత్న ( Taarak Ratna )అకాల మృతితో అప్పట్లో విజయసాయిరెడ్డి స్పందించారు. మాజీ సీఎం చంద్రబాబు తో పాటు నందమూరి బాలకృష్ణతో కూడా విజయసాయిరెడ్డి సన్నిహితంగా గడిపారు. తారకరత్న దశదిన కర్మల్లో తరచూ చంద్రబాబుతో విజయసాయిరెడ్డి కలిసేవారు. ఆ సందర్భంలో చాలా రకాల పుకార్లు షికార్లు చేశాయి. ఒక విధంగా చెప్పాలంటే విజయసాయిరెడ్డి పై అప్పటినుంచి వైసీపీలో ఒక రకమైన అనుమానం ప్రారంభం అయ్యింది. అయితే నందమూరి తారకరత్న కుటుంబ సభ్యులతో అలేఖ్య రెడ్డికి అంతగా పొసగడం లేదు. ఈ తరుణంలో వారి ఆలనా పాలన విజయసాయిరెడ్డి తో పాటు బాలకృష్ణ చూస్తూ వస్తున్నారు.
* ఫోటోలు వైరల్
తాజాగా రాజకీయాల నుంచి నిష్క్రమించిన విజయసాయిరెడ్డి తారకరత్న కుటుంబంతో ఆనందంగా గడిపిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన బాబాయ్ విజయసాయిరెడ్డి తమ కుటుంబంతో గడిపిన ఫోటోలను అలేఖ్య రెడ్డి( Alekhya Reddy) సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీకెండ్ విత్ విఎస్సార్ అని పేర్కొంటూ ఆమె పెట్టిన ఫోటోలు వైరల్ గా మారాయి.