Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత.. అమెరికా పౌరుల ప్రయోజనాల కోసం అడుగులను వేగంగా వేస్తున్నారు. ఇప్పటికే కొలంబియా, మెక్సికో దేశాలకు చెందిన పౌరులను అమెరికా బయటికి పంపించే ప్రయత్నాలను మొదలుపెట్టింది. అయితే ఇక్కడ కొలంబియా, మెక్సికో దేశాలు అమెరికా సైనిక విమానాలను ఏమాత్రం తన భూభాగంలోకి దిగనివ్వలేదు. పైగా అమెరికా విసిరిన సవాళ్లకు.. ధైర్యంగా సవాళ్లు విసిరాయి. ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నట్టుగా చెప్పేశాయి. తమ పౌరులను దొంగలను బంధించినట్లు తీసుకొచ్చి.. యుద్ధ విమానాలలో తీసుకురావడం పట్ల కొలంబియా, మెక్సికో దేశాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా సైనిక విమానాలను దిగడానికి ఒప్పుకోలేదు. ఆ దేశ అధ్యక్షులు స్వయంగా రంగంలోకి దిగి ఈ వ్యవహారాన్ని పరిశీలించారు. కొలంబియా, మెక్సికో దేశాలు భారత విస్తీర్ణంతో పోల్చితే చాలా చిన్నవి. సైనిక బలంపరంగా.. ఆర్థిక బలంపరంగా.. సామాజిక బలంపరంగా చూసుకుంటే కూడా చాలా చిన్నవి. అయినప్పటికీ ఆ రెండు దేశాలు అమెరికాను ఎదిరించాయి. ధైర్యంగా ప్రశ్నించాయి. అసలు అవకాశం లేదు.. తలవంచాల్సిన పనిలేదని ధిక్కారాన్ని ప్రదర్శించాయి.
బక్క ప్రాణుల మీదనేనా
భారత్ ఆర్థికంగా నాల్గవ అతిపెద్ద దేశం. జనాభాపరంగా అతిపెద్ద దేశం. మార్కెట్ ప్రకారం కూడా అతిపెద్ద వినియోగదారులు ఉన్న దేశం. అయినప్పటికీ అమెరికా అంటే ఇప్పటికీ భయపడుతూనే ఉంది. మాల్దీవుల మీద, బంగ్లాదేశ్ మీద, పాకిస్తాన్ మీద వీరంగం చేసే వీరజాతీయులు.. బక్క ప్రాణుల మీద ఎదురుదాడికి దిగే ఈ దేశ పుత్రులు.. అమెరికా అంటే మాత్రం మచ్చిక అయిపోతున్నారు. మోకరిల్లి పోతున్నారు. అమెరికన్ మిలిటరీ విమానం అమృత్ సర్ లో ఇవాళ భారతీయులను యుద్ధ విమానాలలో కిందికి దింపుతుంది. అమెరికా చేస్తున్న ఈ చర్యను భారత్ ఏ మాత్రం ఖండించలేదు. పైగా యుద్ద విమానాలలో మన దేశ పౌరులను తీసుకొస్తుంటే ఏమాత్రం నిరసన వ్యక్తం చేయలేదు. ఏదో వినోదం చూస్తున్నట్టు.. అమెరికా చేస్తున్న పని గొప్పదైపోయినట్టు కళ్ళు అప్పగించి చూస్తున్నది. మెక్సికోలో ఉన్న రోషం.. కొలంబియాలో ఉన్న పౌరుషం మనదేశంలో ఉన్న పాలకులకు లేకుండా పోయింది.. ప్రపంచానికి గురువుగా.. అత్యంత శక్తివంతమైన ఆర్థిక దేశంగా పదేపదే ప్రచారం చేసుకుంటున్న ఈ సందర్భంలో.. అమెరికా నుంచి వస్తున్న మన పౌరులకు కనీస సంఘీభావం తెలిపే బలం కూడా లేకుండా పోయింది. అమెరికాలో అక్రమంగా ఉంటే ఏం చేస్తారు? ఇలానే కదా తీసుకొస్తారు? అనే ప్రశ్నలు ఉదయించినప్పటికీ.. పౌరుల భద్రత ముందు.. పౌరుల ఆకాంక్షల ముందు అవేవీ నిలబడవు. ఎందుకంటే వాటిని కాపాడటమే పాలకుల ప్రధాన ధర్మం కావాలి. అంతేతప్ప హౌడీ మోడీ వంటి కార్యక్రమాలు కాదు కావాల్సింది. వ్యక్తిగత వ్యాకులతకు.. వ్యక్తిగత ప్రచారానికి పాలకులు పరిమితమైపోయినప్పుడు.. ప్రజల ఆకాంక్షలు ఇదిగో ఇలాగే మిలిటరీ విమానంలో బందీ అయిపోతాయి.. నిలువెత్తు ఆంక్షల మధ్య కూలబడిపోతాయి.