Prashant Kishore : ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. మూడు పార్టీల మధ్య సమన్వయం సరిగానే సాగుతోంది. ఐక్యతగా ఉంటూనే ఎవరికివారు ఎదగాలని మూడు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా బిజెపి,జనసేన ఏపీలో ఎదిగేందుకు ఇదే సమయం అని భావిస్తున్నాయి. అటు తెలుగుదేశం పార్టీ సైతం బలం పెంచుకునే పనిలో పడింది. సభ్యత్వ నమోదు కోటికి దాటింది. ఇంకోవైపు పార్టీలో లోకేష్ కు పదోన్నతి కల్పించేందుకు కసరత్తు జరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో లోకేష్ సమావేశం కావడం ఇంకా ప్రాధాన్యత సంతరించుకుంది.
* విలువైన సలహాలు, సూచనలు
ఈ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party) అనుకూలంగా ప్రకటనలు చేశారు ప్రశాంత్ కిషోర్. ఎన్నికలకు నెలల ముందు ఆయన నేరుగా అమరావతికి వచ్చారు. చంద్రబాబుతో సమావేశం అయ్యారు. కీలకమైన సూచనలు చేశారు. అయితే అంతకంటే ఆరు నెలల ముందే ప్రశాంత్ కిషోర్ టీం ఏపీలో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. టిడిపి వ్యూహకర్త రాబిన్ శర్మ నేతృత్వంలో వారు పని చేసినట్లు సమాచారం. అయితే ఎన్నికల ముంగిట చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ కలవడం ద్వారా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. అదే సమయంలో ఎన్నికల్లో టిడిపి గెలుపు పొందుతుందని ప్రశాంత్ కిషోర్ జోష్యం చెప్పారు. అది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం చేకూర్చింది.
* చర్చకు అనేక రకమైన అంశాలు
అయితే తాజాగా లోకేష్( Nara Lokesh) ప్రశాంత్ కిషోర్ తో సమావేశం కావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలో గత ఎనిమిది నెలల్లో నెలకొన్న రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వ పాలనపై ప్రశాంత్ కిషోర్ ఒక రిపోర్ట్ లోకేష్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు అధిగమించాల్సిన అంశాల గురించి అందులో ప్రస్తావించినట్లు సమాచారం. ముఖ్యంగా వైసిపి ని ఎలా నియంత్రించాలి అనేది ప్రశాంత్ కిషోర్ ఒక రిపోర్ట్ రూపంలో ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్వాశ్రమంలో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. అందుకే ఆ పార్టీకి ఉన్న బలం, ప్లస్సులు, మైనస్లు ప్రశాంత్ కిషోర్ కు తెలుసు. అందుకే ఒక నివేదిక రూపంలో లోకేష్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీకి ఛాన్స్ ఇస్తే జగన్ దూకుడుగా ముందుకు వెళ్తారని.. అందుకే ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని ప్రశాంత్ కిషోర్ లోకేష్ కు సూచించినట్లు సమాచారం.
* కూటమిపై వ్యతిరేకత
కూటమి( Alliance ) ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని.. దానిని ప్రారంభంలోనే నియంత్రించాలని ప్రశాంత్ కిషోర్ లోకేష్ కు సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుపై ఫోకస్ చెయ్యాలని.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేసి చూపించాలని ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే వైసిపి ని ఎలా నియంత్రించవచ్చో కూడా వివరించినట్లు సమాచారం. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఎలక్షన్ ఫండింగ్ కోసమే లోకేష్ ను ప్రశాంత్ కిషోర్ కలిసినట్లు ఒక ప్రచారం ఉంది. అయితే ఇది ఉభయ కుశలోపరి సమావేశం అని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.