Lady Aghori : : ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ మాత హల్చల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో కార్తీకమాసంలో పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఆమె వచ్చారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తిలో సంచలనం సృష్టించారు. నిన్న పిఠాపురం పాదగయా క్షేత్రంలో అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీకాళహస్తి చేరుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలోకి వెళ్లే ప్రయత్నం చేసిన అఘోరీని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కారులో ఉన్న పెట్రోల్ డబ్బా తీసుకుని ఒంటిపై పోసుకున్నారు. ఆత్మార్పణకు యత్నించారు. తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు అఘోరీ మాత. ఇటీవల తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారు. కార్తీక మాసం కావడంతో ఏపీలోని అన్ని దేవాలయాలను సందర్శిస్తున్నారు. అయితే శ్రీకాళహస్తి గుడిలోకి వెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఆత్మార్పణ చేయడానికి ప్రయత్నించారు. ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో అక్కడ ఉన్నవారు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
* భద్రతా సిబ్బంది అభ్యంతరం
అయితే ఈ విషయంలో భద్రతా సిబ్బంది అభిప్రాయాలు వేరేలా ఉన్నాయి. ఆలయాన్ని సామాన్య సందర్శకుల మాదిరిగా నిబంధనలు పాటించుకుంటూ దర్శించుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఇలా దిగంబరంగా ఆలయంలోకి అనుమతించే ప్రసక్తి లేదని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆ విషయం తనకు చెప్పకుండానే తనను అడ్డుకున్నారని.. విశాఖలో ఆలయాల సందర్శన సమయంలో తాను డ్రెస్ రూల్స్ పాటించానని అఘోరీ మాత చెబుతున్నారు. ఇక ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఆమెను అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం శ్రీకాళహస్తి నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే ఆత్మహత్యకు పాల్పడిన ఆమెపై పోలీసులు కేసు నమోదు చేస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
* సోషల్ మీడియాలో హల్ చల్
అయితే గత కొద్ది రోజులుగా ఈ అఘోరీమాత యూట్యూబ్లో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. రెండు రోజుల కిందట కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఆమె ప్రత్యక్షమయ్యారు. కర్నూలు నుంచి ఆత్మకూరు వెళుతుండగా స్థానిక యువకులు చూసి.. ఆమె కారును వెంబడించారు. వీడియోలు తీశారు. అయితే ఈ నెల ఒకటిన తాను ఆత్మార్పణ చేసుకుంటానని ఇప్పటికే ప్రకటించారు అఘోరీ మాత. ఇప్పుడు ఆలయ సిబ్బంది అడ్డుపడడంతో అన్నంత పని చేశారు.