Adari Anand Kumar: విశాఖ డెయిరీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు అడారి ఆనంద్ కుమార్. ఆయనతో పాటు పదిమంది డైరెక్టర్లు కూడా రాజీనామా ప్రకటించారు. వారంతా వైసిపి సభ్యత్వంతో పాటు పదవులకు రాజీనామా చేశారు. టిడిపిలోకి వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ అనూహ్యంగా ఆనంద్ కుమార్ బిజెపిలోకి వెళ్లిపోయారు. నేరుగా అమిత్ షా తో మంతనాలు జరిపి బిజెపిలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. ఈ విషయంలో టిడిపి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే గత ఆరు నెలలుగా విశాఖ డెయిరీ అవకతవకలపై టిడిపి ఆరోపణలు చేస్తోంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక అడుగు ముందుకు వేసి శాసనసభ సంఘాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించారు. ఎలాగైనా ఆనంద్ కుమార్ ను బాధ్యుడిని చేస్తూ అవినీతిని నిరూపించాలని చూశారు. అయితే అదే సమయంలో వైసీపీకి రాజీనామా చేసిన ఆనంద్ కుమార్ టిడిపిలోకి వచ్చేందుకు సిద్ధపడ్డారు. విశాఖ జిల్లా నేతలు అడ్డు తగలడంతో నేరుగా బిజెపి అగ్రనేతలకు టచ్ లోకి వెళ్లారు. బిజెపిలో చేరిపోవడంతో ఆయన కూటమి భాగస్వామ్య నేతగా మారిపోయారు.
* గత ఐదేళ్లలో అవినీతి
ఆనంద్ కుమార్ తండ్రి అడారి తులసిరావు సుదీర్ఘకాలం టిడిపిలోనే కొనసాగారు. తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతు దారుడుగా నిలిచారు. అందుకే 2019 ఎన్నికల్లో ఆనంద్ కుమార్ కు చంద్రబాబు అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఆనంద్ కుమార్ వైసీపీలోకి వెళ్లిపోయారు. అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఆనంద్ కుమార్ అవినీతికి పాల్పడ్డారు అన్నది టిడిపి నుంచి వచ్చిన ఆరోపణ. వైసిపి పెద్దల అండదండలతో అవినీతికి పాల్పడ్డారని.. పాల రైతులకు నష్టం కలిగేలా వ్యవహరించారని టిడిపి నేతలు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఇటీవల శాసనసభా సంఘం విశాఖ డైరీ ఎండీ తో పాటు ఉద్యోగులను విచారించింది. ఈ నేపథ్యంలోనే చైర్మన్ ఆనంద్ కుమార్ రాజీనామా చేశారు.
* బిజెపిలో ఎలా చేర్చుకుంటారు?
అయితే ఆనంద్ కుమార్ విషయంలో విశాఖ జిల్లా నేతలు సీరియస్ గా ఉన్నారు. అయితే అగ్ర నేతలు మాత్రం సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బిజెపి ఆనంద్ కుమార్ ను తీసుకోవాలంటే కచ్చితంగా టిడిపిని ఆశ్రయిస్తుంది. చంద్రబాబు అభిప్రాయాన్ని తీసుకుంటుంది. పైగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఆనంద్ కుమార్ పై ఉన్నాయి. పైగా శాసనసభా సంఘం విచారణ చేపడుతుండడంతో.. ఆనంద కుమార్ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆరా తీస్తుంది బిజెపి. అయితే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే బిజెపి ఆనంద్ కుమార్ ను తీసుకుందన్నది ఒక ప్రచారం నడుస్తోంది. అదే సమయంలో విశాఖ జిల్లాకు చెందిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందన ఎలా ఉంటుందో తెలియాలి. ఇంతటితో ఆడారి ఆనంద్ కుమార్ పై విచారణ చేస్తారా? నిలిపి వేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.