Indiramma Houses Scheme: తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కల నిజం చేసేందుకు చకచకా అడుగులు వేస్తోంది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా సర్వే చేస్తోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే సిలిండర్ పథకాలు అమలు చేస్తోంది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. డిసెంబర్ నెలాఖరు నాటికి సర్వే పూర్తి చేసి.. సంక్రాంతి నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయాలని భావిస్తోంది. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సొంత స్థలం ఉన్నవారికి మొదటి విడతలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేక వెబ్‌సైట్, టోల్‌ఫ్రీ నంబర్, యాప్ అందుబాటులోకి తెచ్చింది. సంక్రాంతికి లబ్ధిదారుల ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. జనవరి 7 నాటికి 80 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని అంచనా వేస్తోంది. తర్వాత లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.
హౌసింగ్ కార్పొరేషన్ బలోపేతం..
గత ప్రభుత్వం హయాంలో హౌసింగ్ సొసైటీని నిర్వీర్యం చేసింది. దీంతో దానిని బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ విభాగాల్లో పనిచేసిన కార్పొరేషన్ ఉద్యోగులను తిరిగి సొంత శాఖలోకి తీసుకువచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిబ్బందిని సిద్ధం చేసుకుంది.
నాలుగు విడతల్లో ఆర్థికసాయం..
ఎంపిక చేసిన లబ్ధిదారులకు నాలుగు విడతల్లో ఆర్థికసాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలతోపాటు మరింత సాయం చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా సిమెంటు, ఇసుక, స్టీల్ ధరలు తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈమేరకు వ్యాపారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. సిమెంటు బస్తా రూ.250, స్టీల్ టన్ను రూ.50 వేలు, ఇసుక రూ.1000కి అందించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.