Round Up 2024: ఎన్నో విశిష్టత మేలుకొలుపు 2024. ముఖ్యంగా ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో ఈ ఏడాదిలో ఏపీ ప్రజలు చవిచూశారు. కేవలం మానవ తప్పిదాలతో ఎంతటి విలయాలు మున్ముందు చూస్తామో సంకేతాలు వచ్చాయి. భారీ విపత్తులతో అంతులేని నష్టం జరిగింది. భవిష్యత్తులో జరగబోయే అనర్ధాలను కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలతో నగరాలే జలమయంగా మారాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. వేలాది ఇల్లు నీట మునిగిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలకు ఇదొక హెచ్చరికే. ఈ ఏడాది వరదలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ తో పాటు ఖమ్మం నగరాలు భారీ నష్టాన్ని చవిచూశాయి. చరిత్రలో ఎన్నడూ చూడని విపత్తును ప్రజలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వాలు బాధితులకు అండగా నిలిచినా.. ఆ విపత్తు చేసిన అనర్థాలనుంచి ఇప్పటికీ ప్రజలు బయటపడడం లేదు.
* అదో ప్రళయ భీకరం
అది ఆగస్టు 31, 2024.. ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మంలో ప్రళయ భీకరం సృష్టించింది వరద. భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. వరద నీరు పోటెత్తింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరి లక్షలాదిమంది నిరాశ్రయులు అయ్యారు. ప్రధానంగా విజయవాడతో పాటు ఖమ్మం నగరానికి కోలుకోలేని దెబ్బతీసింది వరద. బుడమేరు, పాలేరు, మున్నేరు నదులు రికార్డు స్థాయిలో పొంగిపొర్లి.. బహుళ అంతస్తుల లోకి సైతం వరద నీరు వెళ్లిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బుడమేరు డైవర్షన్ ఛానల్ కు ఏకంగా మూడు గంటలు పడ్డాయి. దీంతో విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. నిత్యవసరాలు లేక ప్రజలు అవస్థలు పడ్డారు. తాగడానికి నీరు లేదు. తినడానికి తిండి లేదు. ఏపీ వ్యాప్తంగా 32 మంది మృతి చెందినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కానీ అంతకుమించి నష్టం జరిగిందన్నది వాస్తవం. వరదలు తగ్గుముఖం పట్టాక ఎక్కడికక్కడే మృతదేహాలు వెలుగు చూశాయి.
* పంటలకు అపార నష్టం
పంటలకు అపార నష్టం కలిగింది. ప్రధానంగా దక్షిణ కోస్తా పూర్తిగా దెబ్బతింది. 1,69,370 ఎకరాల్లో పంటలు, 18,424 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. మొత్తం 4.21 లక్షల మందికి రూ.630 కోట్లను పరిహారంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. మరోవైపు వాహనాలకు సైతం పరిహారం అందేలా ఇన్సూరెన్స్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. వారికి లబ్ధి చేకూర్చింది. సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. కృష్ణాజిల్లా కలెక్టరేట్లో బస చేసి వరద సహాయ చర్యలను పర్యవేక్షించారు. మొత్తానికి అయితే 2024 ప్రకృతి ప్రకోపానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.