Aarogyasri Services Closed In AP: ఏపీవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ( aarogyasree ) సేవలు స్తంభించాయి. ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు తమ సేవలను నిలిపివేస్తాయి. బకాయిలు చెల్లించాలని కోరుతూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో కూడా ఇటువంటి హెచ్చరికలు ఇచ్చాయి యాజమాన్యాలు. కానీ ప్రభుత్వం సర్దుబాటు చేయడం, కొన్ని రకాల హామీలు ఇవ్వడంతో విరమించేవి. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. గత నెల 15 నుంచి సమ్మెలోకి వెళ్ళాయి. కానీ శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో వైద్య సేవలు నిలిపివేసాయి. శనివారం కూడా దానిని కొనసాగించాయి. దీంతో పేద, సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బందులు తప్పలేదు.
* పెరుగుతూ వస్తున్న బకాయిలు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాం నుంచి బకాయిలు పేరుకు పోయాయి. దాదాపు మూడు వేల కోట్ల రూపాయల వరకు జగన్ సర్కార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లింపులు చేయలేదు. 2024 జూన్ లో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. పెండింగ్ బకాయిలు చెల్లించడంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయింది. అయితే మూడు నెలల అనంతరం బకాయిలు పెరుగుతూ వస్తుండడంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి వినతు లు ఇస్తూ వచ్చాయి. ఎప్పటికప్పుడు సమ్మె ప్రకటించడం.. ప్రభుత్వ ప్రత్యేక చర్యలు, చర్చలు జరపడం తర్వాత వెనక్కి తగ్గడం పరిపాటిగా వచ్చింది. అయితే ఈసారి బకాయిలు చెల్లిస్తే కానీ.. ఆరోగ్యశ్రీ సేవలు అందించలేమని నెట్వర్క్ ఆసుపత్రులు తేల్చి చెప్పాయి. దీంతో సమ్మె అనివార్యంగా మారింది. వైద్య సేవలు నిలిచిపోవడంతో పేదలకు ఇబ్బందులు తప్పలేదు.
* భారీగా బకాయిలు..
వైసిపి అధికారం నుంచి దిగిపోయేసరికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు( aarogyasree network hospitals ) 2500 కోట్ల రూపాయల బకాయి ఉంది. అయితే విడతల వారీగా చెల్లింపులు చేస్తూ వచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ 16 నెలల కాలంలో పాత బకాయిలతో పాటు కొత్త చెల్లింపులు 3800 కోట్ల రూపాయల వరకు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. మరో 670 కోట్ల రూపాయల బిల్లులను సిఎఫ్ఎంఎస్ కి అప్లోడ్ చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ నెట్వర్క్ ఆసుపత్రులు మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నాయి. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే వైద్య సేవలు అందిస్తామని చెప్పుకొస్తున్నాయి. ఈ పరిణామాలతో రాష్ట్రవ్యాప్తంగా రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.