Rayalaseema : రాయలసీమలో( Rayalaseema ) మరో వివాదం తెరపైకి వచ్చింది. మొన్నటికి మొన్న జెసి ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఆదినారాయణ రెడ్డి అన్నట్టు పరిస్థితి కొనసాగింది. అది మరువక ముందే ఇప్పుడు పులివెందులలో సరికొత్త పంచాయితీ ప్రారంభం అయ్యింది. ఇసుక టెండర్ల విషయంలో టిడిపి నేతలు వీధికి ఎక్కారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి వచ్చింది. తాజాగా కడప జిల్లాలో వర్గపూరు బయటపడింది. రెండు గ్రూపుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. టిడిపి నేత బీటెక్ రవి, టిడిపి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. అందులో భాగంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అనుచరుడు వేంపల్లికి చెందిన ప్రకాష్ ను బీటెక్ రవి అనుచరులు చితక బాదారు. దీంతో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి రంగంలోకి దిగారు. ప్రకాష్ ను విడిచి పెట్టాలని ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మరోసారి వాదులాట జరిగింది. పోలీసులు వచ్చి అదుపు చేయాల్సి వచ్చింది.
* ఇద్దరి మధ్య పోరు
కడప జిల్లాలో బీటెక్ రవి( BTech Ravi ) కీలక నేతగా ఉన్నారు. పులివెందుల టిడిపి ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఆయనకు టిడిపి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వర్గంతో అంతర్గత గొడవలు ఉన్నాయి. ఆధిపత్యం కోసం ఇద్దరు నాయకులు పోటీపడుతున్నారు. ఆ ఇద్దరూ ఇప్పుడు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ షాపుల అంశం తాజాగా ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. రేషన్ షాప్ డీలర్ల కోసం శుక్రవారం పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తమ వర్గానికి చెందిన వారే పరీక్షలకు హాజరు కావాలంటూ ఇరువర్గాలు పోటీపడ్డాయి. ఈ క్రమంలో బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. అదే సమయంలో రామ్ గోపాల్ రెడ్డి అనుచరుడు ప్రకాష్ అనే వ్యక్తి పరీక్ష రాసేందుకు వచ్చాడు. దీంతో ఒక్కసారిగా బీటెక్ రవి అనుచరులు ఆయనపై దాడికి పాల్పడ్డారు.
* అక్కడే ధర్నా
అయితే సమాచారం అందుకున్న రామ్ గోపాల్ రెడ్డి ( ramgopal Reddy)భార్య ఉమాదేవి ఒక్కసారిగా రంగంలోకి దిగారు. ప్రకాష్ పై దాడిని ఖండించారు. అక్కడే ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల వారిని శాంతింప చేసేందుకు ప్రయత్నించారు. గతంలో ఇసుక టెండర్ల విషయంలో సైతం బీటెక్ రవి అనుచరులు ఈ విధంగానే వ్యవహరించారు. ఇప్పుడు రేషన్ షాపుల కోసం పరీక్ష రాసేందుకు వచ్చిన వ్యక్తిపై దాడి చేశారు. ఇది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది. అయితే మున్ముందు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరింత బయటపడే అవకాశం కనిపిస్తోంది.
* కూటమి హవా
మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో( Kadapa district) టిడిపి కూటమి ఘన విజయం సాధించింది. పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు చోట్ల గెలుపు కూటమి పార్టీలకే దక్కింది. వైసీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే జగన్ పై పోటీ చేశారు బిటెక్ రవి. వైసిపి అధికారంలో ఉన్నప్పుడే ఆయన పెద్దగా లెక్క చేయలేదు. వైసిపి బెదిరింపులకు ఎదురొడ్డి నిలిచారు. పార్టీ అధికారంలోకి రాగానే బిటెక్ రవికి పదవి వస్తుందని అంతా ప్రచారం నడిచింది. కానీ ఆయనకు ఎటువంటి పదవి లేకుండా పోయింది. మరోవైపు మరో నేత రామ్ గోపాల్ రెడ్డికి మాత్రం ఎమ్మెల్సీ పదవి ఉంది. అయితే పులివెందులలో పట్టు కోసం ఇద్దరు నేతలు ఆరాటపడుతున్నారు. అందుకే వీరిద్దరి మధ్య వివాదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.