Sankranti is coming : విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విడుదలైన మూడు రోజులకే ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను దాటిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. కేవలం మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ స్థాయి హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఇలాంటి వసూళ్లు, ఇప్పుడు సీనియర్ హీరో అయినటువంటి వెంకటేష్ కి సాధ్యపడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కేవలం 33 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది. కేవలం రెండవ రోజు మ్యాట్నీ షోస్ తోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. ‘గేమ్ చేంజర్’ ద్వారా నష్టాలను పొందిన బయ్యర్స్ ని లాభాల బాట పట్టించింది ఈ చిత్రం.
అయితే విడుదలైన మూడు రోజులకు ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం వివరంగా చూద్దాము. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మూడవ రోజు 13 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయట. నైజాం ప్రాంతం లో 4 కోట్ల 20 లక్షలు, సీడెడ్ లో రెండు కోట్ల 30 లక్షలు, ఉత్తరాంధ్ర లో కోటి 75 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో కోటి 20 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో కోటి రూపాయిలు, గుంటూరు జిల్లాలో కోటి 15 లక్షలు, కృష్ణ జిల్లాలో కోటి 10 లక్షలు, నెల్లూరు జిల్లాలో 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 13.20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద మూడు రోజులకు ఈ చిత్రానికి 45 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి 1 మిలియన్ డాలర్స్ కి పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సోమవారం రోజున విడుదలైన ఒక సీనియర్ హీరో సినిమాకి 1 మిలియన్ కి పైగా గ్రాస్ వసూళ్లు రావడం అనేది ఇంతకు ముందు ఎవరికీ జరగలేదు. కేవలం వెంకటేష్ కి మాత్రమే ఆ అరుదైన అవకాశం దక్కింది. ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి ఓవర్సీస్ లో మొదటి మూడు రోజులకు 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ లో ఈ చిత్రం విశ్వరూపం చూపే అవకాశాలు ఉన్నాయి. మొదటి వారం లోనే వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని దాటబోతుంది ఈ చిత్రం.