CM Jagan: ఎన్నికల్లో కూడా పవన్ ను ఓడించేందుకు వైసిపి గట్టిగానే ప్రయత్నిస్తోంది. పవన్ ను ఓడించి తీరుతామని వైసీపీ శ్రేణులు సైతం తేల్చి చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు వైసిపి,టిడిపి, జనసేన కీలక నేతలు పోటీ చేయబోయే నియోజకవర్గాల పై స్పష్టత వచ్చినా.. పవన్ విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. అయితే పవన్ కోసం చాలా రకాల స్కెచ్ లకు వైసిపి సిద్ధంగా ఉంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓటమి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం విశేషం. రాజకీయంగాను, ఎన్నికల ప్రక్రియలోనూ పవన్ ను ఎలాగైనా దెబ్బ తీయాలని జగన్ సర్కారు కృత నిశ్చయంతో ఉండడం విశేషం.
గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల పోటీ చేశారు. గాజువాక తో పాటు భీమవరం లో బరిలో నిలిచి ఓడిపోయారు. రెండు చోట్ల రెండో స్థానంలో నిలిచిపోయారు. త్రిముఖ పోటీ ఉండడంతో అప్పట్లో ఓటమి సాధ్యమైంది. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీతో కూటమి కట్టడంతో పవన్ ను కట్టడి చేయడం అంత సులువు కాదు. అందుకే రాజకీయంగా కంటే ఎన్నికల నిర్వహణలో పవన్ ను దెబ్బ కొట్టాలని జగన్ భావించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో అధికారులను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని.. పవన్ ను మరోసారి ఓడించాలని జగన్ వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడికక్కడే అనుకూలమైన అధికారులను నియమించినట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ పోటీ చేస్తారని గత ఏడాదిగా ప్రచారం జరుగుతోంది. అక్కడ ఎలాగైనా పవన్ ను ఓడించాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో పవన్ ను ఢీకొట్టడానికి ముద్రగడను పార్టీలోకి రప్పించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నియోజకవర్గంలో 90000కు పైగా కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. ఇక్కడ పవన్ గెలుపు తధ్యమన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ముద్రగడను రప్పించి కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టగా.. మరికొందరు అనుకూల అధికారులను నియమించి ఎన్నికల పరంగా దెబ్బతీయాలని వ్యూహరచన చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
పిఠాపురం నియోజకవర్గంలో ఇద్దరు వివాదాస్పద అధికారులను ఎన్నికల అధికారులుగా నియమించడం విశేషం. అయితే ఏడాది కిందటి నుంచి వైసీపీ సర్కస్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. తమకు అనుకూలమైన ఇద్దరు అధికారులను ఆర్వో, ఈఆర్వోలుగా నియామకానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కాకినాడ జిల్లాలో నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న జెసి ప్రవీణ్ ను ఆర్వోగా, ఎన్నో ఆరోపణలు ఉన్న డిప్యూటీ కలెక్టర్ సుబ్బారావును ఈఆర్వో గా నియమించడం వెనుక పెద్ద రాజకీయ ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రవీణ్ రంపచోడవరం పిఓగా, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ గా పని చేశారు. తరువాత జేసిగా నియమితులయ్యారు. అటువంటి వ్యక్తిని నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల అధికారిగా నియమించారు. మరోవైపు డిప్యూటీ కలెక్టర్ సుబ్బారావు ఓటర్ల జాబితా సవరణ సమయంలో దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్లిపోయారు. అదే సమయంలో వైసీపీ నేతలపై ఓట్ల అక్రమాల విషయంలో ఫిర్యాదులు కూడా వచ్చాయి. దాని నుంచి తప్పించుకునేందుకే సెలవు పెట్టారని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే అధికారిని ఈర్వోగా నియమించడం అనుమానాలకు తావిస్తోంది. అధికార దుర్వినియోగం చేసి పవన్ విజయాన్ని అడ్డుకట్ట వేసేందుకు జగన్ సర్కార్ ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.