AP Fishermen: సువిశాల తీర ప్రాంతం ఏపీ సొంతం. దాదాపు 1000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. తిరుపతి జిల్లా( Tirupati district) తడ నుంచి శ్రీకాకుళం జిల్లా డొంకూరు వరకు సువిశాల తీర ప్రాంతం ఉంది. లక్షలాదిమంది మత్స్యకారులు ఉన్నారు. కానీ ఆశించిన స్థాయిలో వారికి వేట గిట్టుబాటు కావడం లేదు. పోర్టులతో పాటు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కార్యరూపం దాల్చడం లేదు. హామీలకే పరిమితం అవుతోంది. వీరితో మత్స్యకారులు పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కావు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ప్రమాదం మాటున వేట సాగిస్తున్నారు. సరిహద్దు జలాలు దాటి విదేశాల కోస్ట్ గార్డులకు చిక్కుతున్నారు. తాజాగా ఏపీకి చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ సరిహద్దు జలాలు దాటి అక్కడి కోస్ట్ గార్డులకు చిక్కారు. దీంతో బాధిత కుటుంబాలు ఆందోళనతో ఉన్నాయి.
* వేట సాగక..
విజయనగరం జిల్లాలో( Vijayanagaram district) భోగాపురం, పూసపాటిరేగ మండలాలు తీర ప్రాంతంలో ఉన్నాయి. ఈ జిల్లాలో 29 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. అయితే ఇక్కడి మత్స్యకారులు విశాఖ హార్బర్ ద్వారా వేటకు వెళుతుంటారు. ఈ క్రమంలో ఆ రెండు మండలాలకు చెందిన ఎం.చిన్న అప్పన్న, ఎం. రమేష్, ఎస్. అప్పలకొండ, ఎం. ప్రవీణ్, ఎస్.రాము, ఎం చిన్న అప్పన్న, నక్క రామన్న, వి సీతయ్య తదితరులు బంగాళాఖాతంలో చేపల వేట సాగిస్తూ బంగ్లాదేశ్ సరిహద్దు జలాల్లోకి ప్రవేశించారు. దీంతో అక్కడి కోస్ట్ గార్డులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అదే విషయాన్ని వారు బోటు యజమాని సత్యనారాయణకు చెప్పడంతో ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయి.
* ఈనెల 13న బయలుదేరి..
వీరంతా ఈనెల 13న విశాఖ( Visakhapatnam) చేపల రేవు నుంచి సత్యనారాయణకు చెందిన ఎం ఎం 735 బోటులో చేపల వేటకు బయలుదేరారు. దాదాపు మూడు వారాలపాటు వేట సాగించేందుకు వెళ్లారు. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో వేటసాగిస్తుండగా బుధవారం తెల్లవారుజామున సరిహద్దు జలాల్లోకి ప్రవేశించారు. దీంతో అక్కడి కోస్ట్ కార్డులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా వేట గిట్టుబాటు కాక వీరు విశాఖ వెళ్లి.. అక్కడి ప్రైవేట్ బోటు తీసుకుని వేటకు వెళుతుంటారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకు చిక్కారు. కొన్నేళ్ల కిందట జిల్లాకు చెందిన మత్స్యకారులు పాకిస్తాన్లో ఉండిపోయారు. చాలా ఏళ్ల తరబడి అక్కడే ఉండిపోగా.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విడుదలయ్యారు. మరోసారి అటువంటి పరిస్థితి తలెత్తడంతో బాధిత కుటుంబాలు ఆందోళనతో ఉన్నాయి.