AP Rain Alert: ఏపీకి( Andhra Pradesh) భారీ ప్రమాదం పొంచి ఉంది. వాయుగుండం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర శ్రీలంక మధ్య ఏర్పడిన అల్పపీడనం ఈరోజు మధ్యాహ్నం తీవ్ర వాయుగుండం గా మారే అవకాశం కనిపిస్తోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి 24 గంటల్లో మరింత బలపడనుంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు కదిలేలా సూచనలు ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడు, కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మధ్యాహ్నం నుంచి తీరం వెంబడి 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.
* కుండపోత వాన
ఈరోజు ఏపీలోని దక్షిణ కోస్తా( South coastal ) ప్రాంతాల్లో కుండ పోత వానలు పడనున్నాయి. ఎప్పటికీ ప్రారంభం అయ్యాయి కూడా. ప్రధానంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైయస్సార్ కడప జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అక్కడ. మరోవైపు అనంతపురం, శ్రీ సత్య సాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. పల్నాడు జిల్లాకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ అయింది. నెల్లూరు తో పాటు ప్రకాశం జిల్లాలో సైతం వర్షాలు పడనున్నాయి. రాయలసీమలో సైతం వర్ష ప్రభావం ఉంటుంది.
* సహాయక చర్యలకు సిద్ధం..
మరోవైపు భారీ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం అయ్యింది. ప్రజలను అప్రమత్తం చేస్తూనే అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్డిఆర్ఎఫ్( ndrf), ఎస్డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. అయితే గడిచిన 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ప్రధానంగా శ్రీకాళహస్తిలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోని పది ప్రాంతాల్లో పది సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, వైయస్సార్ కడప జిల్లాల్లో సైతం వర్షాలు పడ్డాయి. మరోవైపు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో పాటు హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్షించారు. అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు ఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అన్ని పాఠశాలలకు గురువారం సెలవులు ప్రకటించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.