BRS: భారత రాష్ట్ర సమితికి కాలం కలిసి రావడం లేదు.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోవడం.. కెసిఆర్ కాలుజారి పడటం.. చాలావరకు పురపాలకాలు కాంగ్రెస్ ఖాతాలో పడటం.. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కొన్ని స్థానాల్లో అభ్యర్థులు ముందుకు రాకపోవడం.. వంటి ఘటనలను మర్చిపోకముందే.. శుక్రవారం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కెసిఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను ఈడి అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా భారత రాష్ట్ర సమితిలో కలకలం నెలకొంది. కవిత నివాసానికి కేటీఆర్, హరీష్ రావు వంటి వారు చేరుకున్నప్పటికీ అరెస్టును ఆపలేకపోయారు. కోర్టులో తేల్చుకుంటామని చెప్పినప్పటికీ.. ఈ కేసులో ఈడి చాలా బలంగా అడుగులు వేసిందని తెలుస్తోంది. న్యాయ నిపుణులు కూడా కవితకు బెయిల్ రావడం అసాధ్యమని చెబుతున్నారు. కవిత వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉందని, తుది తీర్పు రాకుండానే ఎలా అరెస్టు చేస్తారని భారత రాష్ట్ర సమితి నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈడి అధికారులు మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కవితను అరెస్టు చేశారని.. ఇటీవల ఆ చట్టానికి కేంద్రం మరిన్ని కోరలు తొడిగిందని.. అలాంటప్పుడు బెయిల్ రావడం దాదాపు అసాధ్యమని వారు గుర్తు చేస్తున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉదంతాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇక శనివారం ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది ఆసక్తికరంగా మారింది.. ఈడి అధికారులు కేసీఆర్ కు షాక్ ఇస్తే.. స్థానిక పోలీసులు భారత రాష్ట్ర సమితి కీలక నాయకులకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు.
శుక్రవారం అర్ధరాత్రి నుంచి కరీంనగర్ లోని ప్రతిమ మల్టీప్లెక్స్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు భారీగా నగదు లభ్యమైనట్టు తెలుస్తోంది. ఆ నగదును సీజ్ చేశారు. సుమారు ఆరున్నర కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ డబ్బు భారత రాష్ట్ర సమితి నాయకులకు చెందినదిగా పోలీసులు భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఆ నగదు ఉంచినట్టు సమాచారం. కాగా, కరీంనగర్ లో ఉన్న ప్రతిమ మల్టీప్లెక్స్ భారత రాష్ట్ర సమితి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ బంధువులకు చెందింది. ఇప్పటికీ ఇంకా అందులో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరున్నర కోట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నప్పటికీ.. పూర్తిస్థాయి సమాచారం రావడానికి చాలా సమయం పడుతోందని తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగానే అక్రమ మైనింగ్, క్వారీల నిర్వహణతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని అభియోగాలు మోపుతూ పోలీసులు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.. మధుసూదన్ రెడ్డి పటాన్ చెరువు మండలం లక్డారంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని, 10 సంవత్సరాలుగా క్వారీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల మంత్రి దామోదర రాజనర్సింహకు అక్రమ మైనింగ్ పై ఫిర్యాదులు రావడంతో ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి మధుసూదన్ రెడ్డి అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని గుర్తించారు. ఇందులో భాగంగా అరెస్ట్ చేశారు. మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్తుండగా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు అడ్డుపడ్డారు. అయితే పోలీసులు వారిని చెదరగొట్టడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.