MLC Kavitha Arrested: కవిత అరెస్టు.. నేడు ఈడీ ఏం చేయనుంది?

శుక్రవారం కవిత అరెస్టులో అనేక నాటికి పరిణామాలు చోటుచేసుకున్నాయి. లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కోణంలో పీఎంఎల్ఏ (prevention of money laundering act) ప్రకారం ఆమెను అరెస్టు చేసినట్టు ఈడి అధికారులు చెబుతున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 16, 2024 9:34 am

MLC Kavitha Arrested

Follow us on

MLC Kavitha Arrested: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో (Delhi liquor scam) కెసిఆర్ (KCR) కుమార్తె, భారత రాష్ట్ర సమితి(BRS) ఎమ్మెల్సీ కవితను (MLC Kaviha) ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసింది. శనివారం ఉదయం 10:30కు కవితను రౌజ్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) లో ఈడీ అధికారులు హాజరు పరుస్తారు. ప్రస్తుతం కవిత వెంట ఆమె భర్త అనిల్ కుమార్, న్యాయవాది మోహిత్ రావు ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

శుక్రవారం కవిత అరెస్టులో అనేక నాటికి పరిణామాలు చోటుచేసుకున్నాయి. లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కోణంలో పీఎంఎల్ఏ (prevention of money laundering act) ప్రకారం ఆమెను అరెస్టు చేసినట్టు ఈడి అధికారులు చెబుతున్నారు. శుక్రవారం ఈడి అధికారుల బృందం అకస్మాత్తుగా హైదరాబాద్ వచ్చింది. వెంట సిఆర్పిఎఫ్ భద్రతా దళాలను తీసుకొని ఆమె ఇంటికి వెళ్ళింది. కవిత నివాసంలో నాలుగు గంటల పాటు సోదాలు జరిపింది. అనంతరం ఆమెను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించింది. వాస్తవానికి తనను అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టులో కవిత గతంలోనే పిటిషన్ వేశారు. ఆ కేసు మార్చి 19న విచారణకు రానుంది. వాస్తవానికి ఈడి అధికారులు సోదాలు జరిపి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వెళ్తారని భావించారు. గతంలో కూడా ఇలానే జరిగింది. కానీ ఈసారి ఈడి అధికారులు కవితకు షాక్ ఇచ్చారు. కవిత ఇంట్లోకి వెళ్లిన వెంటనే ఆమె ఫోను, సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో లోపల ఏం జరుగుతుందో చాలాసేపటి దాకా తెలియ రాలేదు.

శనివారం కవితను తమ కస్టడీలోకి తీసుకొని ఈడి అధికారులు విచారణ సాగిస్తారని తెలుస్తోంది. అయితే శుక్రవారం కవిత అరెస్టు కాగానే రాత్రికి రాత్రే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఢిల్లీ వెళ్లిపోయారు. ఆయన వెంట కొంతమంది న్యాయవాదులు కూడా ఉన్నారు.. గతంలో కవిత కేసును విచారించిన సోమా భరత్ అనే న్యాయవాది కూడా కేటీఆర్ వెంట ఉన్నారు. ఇప్పటికే మోహిత్ రావ్ అనే న్యాయవాదిని కవిత నియమించుకున్నారు. కవిత అరెస్టు సరికాదు అంటూ కేటీఆర్ వాదిస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగానే ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఈడి అధికారులతో ఆయన వాగ్వాదానికి కూడా దిగారు. అయితే తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ ఈడి అధికారులు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కాగా శనివారం ఏం జరుగుతుందో ఢిల్లీ వర్గాల ద్వారా కేసిఆర్ ఆరా తీస్తున్నారు.