TDP Party : కృష్ణాజిల్లాలో( Krishna district ) మాజీ మంత్రి కొలుసు పార్థసారథి తీరుపై టిడిపి శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు పార్థసారథి. ఎమ్మెల్యే కావడంతో బీసీ కోటాలో మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. అయితే సారధి వైసీపీ నేతలతో అంటగాకుతున్నారు అన్నది టిడిపి నుంచి వినిపిస్తున్న మాట. ముఖ్యంగా వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ అనుచరులను ప్రోత్సహిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. మైనింగ్ వ్యవహారాల్లో వారికి అనుకూలంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బహిరంగంగానే కామెంట్స్ చేశారు. పార్థసారథి తీరుపై ఏకంగా హై కమాండ్ సైతం ఫిర్యాదు చేశారు. మరోవైపు పార్థసారథి తీరు నచ్చక నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున గుడ్ బై చెబుతుండడం ఇప్పుడు ప్రాధాన్యత అంశంగా మారింది.
* బీసీ కోటాలో మంత్రి
వాస్తవానికి కొలుసు పార్థసారథి( kolusu parthasaradhi) పెనమలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచారు. కానీ జగన్ ఆయనకు మంత్రివర్గంలోకి తీసుకోలేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు సారధి. ఎన్నికలకు ముందు టిడిపిలో చేరిన సారధికి నూజివీడు టికెట్ సర్దుబాటు చేశారు చంద్రబాబు. ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో బీసీ కోటాలో మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే వైసీపీ శ్రేణులతో ఉన్న సంబంధాలతో సారథి వారిని ప్రోత్సహిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని అనచురులకు మైనింగ్ కాంట్రాక్ట్ అప్పగించారన్నది ప్రధాన ఆరోపణ.
* మాజీ మంత్రితో చెట్టాపట్టాలు
మొన్న ఆ మధ్యన నూజివీడులో( Nu jividu ) సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ జరిగింది. సొంత నియోజకవర్గ కార్యక్రమం కావడంతో మంత్రి పార్థసారథి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ తో వేదిక పంచుకున్నారు పార్థసారథి. అప్పట్లో అది వివాదాస్పదం కావడంతో క్షమాపణలు కూడా కోరారు. తర్వాత వైసిపి నేతలకు మైనింగ్ కాంట్రాక్ట్ అప్పగించారని మరో ఆరోపణ వచ్చింది. అది మరువక ముందే ఇప్పుడు నూజివీడు నియోజకవర్గంలో వైసీపీ నేతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా టిడిపి జెండా మోసిన శ్రేణులను పక్కనపెట్టి.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పెద్ద పీట వేశారన్నది ప్రధాన ఆరోపణ. దీంతో చాలామంది పార్టీకి గుడ్ బై చెబుతుండడం విశేషం.
* వైసీపీ నేతలకు అనుకూలంగా
తాజాగా చాట్రాయి మండలం( chatrai mandalam ) నరసింహరాయిని పేటకు చెందిన 500 మంది టిడిపి కార్యకర్తలు పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఆ గ్రామంలో ఇటీవల వైసిపి లో చేరిన నేతలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడాన్ని నిరసిస్తూ వారంతా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. టిడిపికి చెందిన వారి పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దుచేసి.. వైసీపీ నేతలకు కట్టబెట్టారని మంత్రిపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు వైసీపీ నేతకు సహకార బ్యాంక్ చైర్మన్ పదవి ఇవ్వడం టిడిపి కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. తిరువూరు, నూజివీడు తో పాటు కీలకమైన గన్నవరం, గుడివాడ నియోజకవర్గం వైసీపీ నేతలకు అనుకూలంగా మంత్రి వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సారధికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.