Vishaka RK Beach : సముద్రం ఉన్నట్టుండి వెనక్కి వెళ్లడం ఇప్పుడు విశాఖ వాసులను ఆందోళనకు గురిచేస్తుంది. అమావాస్య, పౌర్ణమి సమయాల్లో కలిగే వాతావరణ పరిస్థితుల ప్రభావమో తెలియదు కానీ విశాఖ తీరంలో సముద్రం 400 అడుగుల మేర వెనక్కి వెళ్ళింది. దీంతో సముద్రంలో అలజడి రేగింది. అసలు దీనికి కారణం ఏంటా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో సముద్రం 400 మీటర్ల పాటు వెనక్కి వెళ్ళిపోయింది. దీంతో అలలు ఉండాల్సిన చోట.. పెద్ద రాళ్లు బయటపడ్డాయి. దీంతో జనాల్లో ఒక రకమైన సందడి నెలకొంది. అక్కడ సెల్ఫీలు దిగేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా వీకెండ్ లో ఆర్కే బీచ్ రద్దీగా ఉంటుంది. జనాలతో కిటకిటలాడుతూ కనిపిస్తుంది. అటువంటి సమయంలో ఉన్నపలంగా సముద్రం వెనక్కి వెళ్లిపోవడం అంటే సాధారణ విషయం కాదు. అది కూడా దాదాపు అర కిలోమీటర్ కావడం గమనార్హం.
* నగరవాసులకు ఆసక్తి
విశాఖ బీచ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. తీరంలో ఏ చిన్నపాటి మార్పు జరిగినా నగరవాసులు ఇట్టే పసిగట్టేస్తారు. నిత్యం బీచ్ ను సందర్శించిన వారు ఉంటారు. నగరంలో ఉన్న యువత, మహిళలు, పిల్లలు, పెద్దలు బీచ్ లో ఆడి పాడి వెళ్తుంటారు. నిత్య జీవితం బీచ్ తోనే ముడిపడి ఉండడంతో ఏ చిన్నపాటి మార్పులైనా ఇట్టే పసిగట్టేస్తారు. తాజాగా సముద్రం వెనక్కి వెళ్లిపోవడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. ఆపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
* సాధారణ ఆటుపోట్లు సహజం
పౌర్ణమి,అమావాస్య సమయాల్లో సముద్రం ఆటుపోట్లకు గురికావడం సహజం.కొద్దిగా వెనక్కి వెళ్లడం.. మరికొద్దిగా ముందుకు రావడం పరిపాటి. సముద్రం ఎత్తు పెరగడం కూడా సహజం. కానీ ఈసారి 400 మీటర్ల పాటు వెనక్కి వెళ్లడం మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. రెండు రోజుల కిందట సముద్రం రంగు మార్చుకుంది. సముద్రంలో నీరు ఎరుపు రంగులోకి మారింది. నీలిరంగు నుంచి మార్పు సంతరించుకోవడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
* సముద్రం లోపల పరిణామాలతోనే..
అయితే సముద్రం లోపల జరిగిన అనేక రకాల పరిణామాల ప్రభావం తీరంపై పడుతుందని.. ఇది సహజ ప్రక్రియగా నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే సాగర కదలికలు గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒక్కసారిగా అలల తాకిడి పెరిగితే ప్రమాదాలు జరగవచ్చని హెచ్చరిస్తున్నారు. ఆర్కే బీచ్ లో సముద్రం 400 మీటర్ల పాటు వెనక్కి వెళ్లిందని తెలుసుకుంటున్న వారు.. చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.