Success Story : ఒక ఉద్యోగం వస్తేనే గొప్ప అన్న రోజులు ఇవి. అటువంటిది ఏకకాలంలో నాలుగు ఉద్యోగాలను సాధించింది ఆ యువతి. తన తల్లిదండ్రులకు గుర్తింపు తీసుకురావాలని భావించింది. కేవలం కాలేజీ యాజమాన్యం తన తల్లిదండ్రులను సన్మానిస్తుందన్న ఆలోచనతోనే వరుసగా ఉద్యోగాలు సాధించింది.ఆ కాలేజీలో ఒకే విద్యార్థి మూడు ఉద్యోగాలు సాధిస్తే వారి తల్లిదండ్రులను చైర్మన్ సత్కరిస్తున్నారు.సామాన్య కుటుంబానికి చెందిన తన తల్లిదండ్రులకు కూడా ఆ గౌరవం దక్కాలని భావించింది.అదే లక్ష్యంతో ముందుకు అడుగు వేసింది. ఏకకాలంలో నాలుగు ఉద్యోగాలను సాధించింది. తొలి ఉద్యోగానికి నాలుగు రెట్లు అదనంగా ప్యాకేజీ సాధించి..నాలుగో ఉద్యోగాన్ని ఎంచుకుంది శ్రావణి అనే యువతి. బాపట్ల జిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడుకు చెందిన శ్రావణి పెదకాకాని వివిఐటిలో బీటెక్ పూర్తి చేసింది. చివరి ఏడాదిలోనే తొలిసారిగా ఎసెన్ ట్యూర్ కంపెనీలో రూ. 4.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికయింది. అయితే తన తల్లిదండ్రులకు గుర్తింపు తీసుకురావాలని భావించి.. మరో మూడు ఉద్యోగాలకు వరుసగా ఎంపికయింది.
* ప్యాకేజీ మొత్తం పెంచుకుంటూ..
అయితే ఒక్కో ఉద్యోగానికి ప్యాకేజీ పెంచుకుంటూ ముందుకు సాగింది. మూడో కంపెనీలో ఐదు లక్షలు, ఐపీఎంలో తొమ్మిది లక్షలు, ఫ్లిప్ కార్డులో 11 లక్షలు, వాల్ మార్ట్ లో 23 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. ఇంటర్వ్యూ ఫేస్ చేసిన అన్ని కంపెనీల్లో ఉద్యోగం లభించిందని.. చివరిగా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తానన్న వాల్ మార్ట్ కంపెనీలో చేరినట్లు శ్రావణి చెబుతోంది.
* సాధారణ కుటుంబం
శ్రావణిది సాధారణ కుటుంబం. తనను చిన్నప్పటినుంచి కష్టపడి చదివించిన తల్లిదండ్రులకు గుర్తింపు రావాలని ఆమె భావించింది. మూడు కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించే విద్యార్థుల తల్లిదండ్రులకు చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ సత్కరిస్తుంటారు. ఆ సత్కారం తన తల్లిదండ్రులకు దక్కాలని కసితో ఉద్యోగాలకు వరుసగా ఎంపికైనట్లు శ్రావణి చెప్పడం విశేషం.
* ఇటువంటి సమయంలో
ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి నియామకాలు అంతంత మాత్రమే. కానీ ఇటువంటి తరుణంలో ఏకకాలంలో నాలుగు ఉద్యోగాలు సాధించడం గొప్ప విషయమే. అద్దంకిలో పదో తరగతి చదువుకున్న శ్రావణి గుంటూరులో ఇంటర్ పూర్తి చేశారు. ఎంసెట్లో 6000 ర్యాంక్ సాధించారు. వివిఐటిలో ఇంజనీరింగ్ సీటు పొందారు. శ్రావణి కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తల్లిదండ్రులతో పాటు అధ్యాపకులు అభినందించారు.