2025 Political Roundup: రాజకీయాలతో( politics) పాటు రాజకీయ సంక్షోభాలు లేకుండా 2025 సాఫీగా సాగిపోయింది. గతం మాదిరిగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా.. కేవలం రాజకీయ ప్రత్యర్థుల కు మాత్రమే ఇబ్బంది కలిగేలా మారింది కూటమి పాలన. 2024 వరకు ప్రతి ఏటా ఒకే పరిస్థితి ఉండేది. ఎందుకంటే అప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేసేవారు. కానీ వ్యవస్థల విధ్వంసం కొనసాగింది. వాటిని సరి చేసే క్రమంలో పాలనాపరమైన అడుగులు పక్కదారి పట్టాయి. దాని ఫలితంగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. అయితే దీనిని గుర్తించారు ఏపీ ప్రజలు. అందుకే 2024 ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. తొలి ఆరు నెలల్లో పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. 2025లో అడుగుపెట్టిన నాటి నుంచి సంక్షేమంతో పాటు అభివృద్ధి చూపించడం ద్వారా.. రెండింటిని సమప్రాధాన్యం ఇస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు కలిగి ఇబ్బంది పెట్టిన నాయకులను.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్రలు చేస్తున్న వారికి గట్టిగానే ట్రీట్మెంట్ ఇస్తోంది. రాజకీయ కక్షలు అని బయటపడకుండా.. అన్నింటినీ చట్టప్రకారం మాత్రమే ముందుకు తీసుకెళ్తోంది. ఐదు సంవత్సరాల విధ్వంసాన్ని కరెక్ట్ చేస్తూ.. కరెక్షన్ చేస్తూ ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం..
అమరావతి పై ఫోకస్..
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణం పై దృష్టి పెట్టింది. 2019లో అధికారం కోల్పోయేసరికి అమరావతి ఎలా ఉండేదో.. ఆరు నెలల కాలంలో అదే స్థానంలోకి తెచ్చింది. మరో ఆరు నెలలు నిధుల సమీకరణకు ప్రయత్నించింది. అది కొలిక్కి వచ్చిన తర్వాత 2025 ద్వితీయార్థంలో అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోడీతో శంకుస్థాపన చేయించింది కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం వేలాదిమంది ఇంజనీరింగ్ నిపుణులు, కార్మికులతో అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రాజెక్టుల పనులన్నీ జరుగుతున్నాయి.
పెట్టుబడుల ఏడాదిగా..
ఒక విధంగా ఏపీకి పెట్టుబడుల ఏడాదిగా 2025 నిలుస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వచ్చింది. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. అనుబంధ పరిశ్రమల రాక కూడా ప్రారంభం అయింది. పెట్టుబడుల పరంగా ఇది గోల్డెన్ ఇయర్. గూగుల్ ఏఐ హబ్ ఓ చరిత్ర కూడా. కాగ్నిజెంట్ తో పాటు టిసిఎస్ వంటి పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. విశాఖలో తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయి.
రాజకీయ ముద్ర లేకుండా..
అయితే రాజకీయ కక్షలు లేవని చెప్పలేం కానీ.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగానే కేసుల నమోదు, అరెస్టుల పర్వం నడుస్తోంది. ఈ ఏడాది చాలామంది వైసిపి నేతలు అరెస్ట్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకున్న వారంతా జైలు పాలు అయ్యారు. కానీ ఒకరి పైన కూడా ప్రభుత్వ కక్షపూరిత ధోరణి మాత్రం కనిపించలేదు. అలా ప్రాజెక్ట్ చేయాలనుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యింది. ఎవ్వర్నీ అర్ధరాత్రి అరెస్టు చేయలేదు. గోడ దూకి ఇళ్లల్లోకి ప్రవేశించలేదు. అన్ని రకాల న్యాయపరమైన అవకాశాలు కల్పించిన తర్వాతనే అరెస్టు చేశారు. ఇప్పటికీ చాలామంది జైల్లోనే ఉన్నారు. కానీ టిడిపి శ్రేణులకు ఇది ఎంత మాత్రం రుచించడం లేదు. అప్పట్లో ఇబ్బంది పెట్టిన వారందరినీ అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
ప్రత్యర్థి ఆశలు అడియాశలు..
రాజకీయంగా కూటమి పార్టీల మధ్య బలమైన బంధాన్ని ఏర్పరిచింది మాత్రం 2024. దానిని మరింత దృఢం చేసింది మాత్రం 2025. కూటమి పార్టీల మధ్య స్నేహం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం అని వైసిపి సవాల్ చేసింది. కానీ ఏడాది కాలంలో మూడు పార్టీల మధ్య బంధం పెరిగిందే కానీ తగ్గలేదు. నామినేటెడ్ పదవులు ఎటువంటి వివాదాలు లేకుండా సర్దుబాటు చేసుకున్నారు. అధినేతలు ఎటువంటి పొరపొచ్చలు వచ్చే విధంగా ప్రకటనలు చేయడం లేదు. పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చిన మాదిరిగానే 15 ఏళ్ల పాటు కొనసాగేందుకు కూటమి పార్టీల శ్రేణులు మానసికంగా సిద్ధమయ్యాయి. కూటమి విచ్ఛిన్నానికి సోషల్ మీడియా వేదికగా జరగని ప్రచారం అంటూ ఏదీ లేదు.. అయినా సరే ఎటువంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాయి మూడు పార్టీల శ్రేణులు. నాయకత్వాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఏడాది కూటమి నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు.