AP Liquor prices update: ఏపీలో( Andhra Pradesh) మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతోంది. అయితే ఆదాయం మరింత పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చింది. పాత ప్రీమియం బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ధరలకే అందిస్తోంది. అయితే ఎప్పటికప్పుడు ప్రీమియం బ్రాండ్లు తమ ధరలను తగ్గిస్తూ వస్తుండడంతో ఏపీలో మద్యం అమ్మకాలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
పాపులర్ ప్రీమియం బ్రాండ్లు సైతం..
సంక్రాంతి( Pongal) సమీపిస్తోంది. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు సైతం జరగనున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పాపులర్ బ్రాండ్లు తమ ధరలను తగ్గించాయి. కొత్త మద్యం పాలసీ వచ్చాక 87 ప్రీమియర్ పాపులర్ బ్రాండ్లు తిరిగి వచ్చాయి. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ బ్రాండ్లు లేవు. ఉన్న కొద్దిపాటి ప్రీమియం బ్రాండ్ల ధరలు ఎక్కువగా ఉండేవి. అప్పట్లో వీటి అమ్మకాలు కూడా 20 శాతానికి మించి జరిగేవి కావు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ధరలను కొంత నియంత్రించడంతో 74 శాతానికి పెరిగాయి. ఇప్పటివరకు 50 బ్రాండ్ల ధరలను తగ్గించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరికొన్ని కంపెనీలు తగ్గించేందుకు ముందుకు వస్తున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా ఈ మధ్యం ధరల తగ్గింపు అనేది చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిన్ననే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
కల్తీ మద్యం గుర్తించేందుకు..
వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మొన్న ఆ మధ్యన నకిలీ డంపు బయటపడటంతో జాగ్రత్త పడింది. నకిలీ మద్యం అమ్మకాలను అడ్డుకునేందుకు మొబైల్ యాప్ తీసుకొచ్చింది. ప్రతి సీసా పై క్యూఆర్ కోడ్ ద్వారా వినియోగదారుడు మద్యం క్వాలిటీ తెలుసుకునే అవకాశం ఉంది. దేశంలోనే మొదటిసారిగా సీసా పై లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇవ్వాలని నిర్ణయించడం కూడా విశేషం. మద్యం బ్రాండ్, తయారీ తేదీతో పాటుగా సీసాకు నెంబర్ కేటాయిస్తూ.. ప్రతి సీసా పైన ముద్రిస్తారు. వినియోగదారుడు ఈ నెంబర్ ఆధారంగా మద్యం కొనుగోలు చేసే విధంగా అవగాహన పెంచనున్నారు. చంద్రబాబు ఈ విధానంపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొన్నటి పరిస్థితులు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు.