YSR MLAs Resignations: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )బ్రహ్మాస్త్రాన్ని సంధించబోతున్నారా? మద్యం కుంభకోణం కేసులో తనను టచ్ చేస్తే అదే చేస్తారా? జైల్లో ఉండగానే ఉప ఎన్నికలకు వెళ్తారా? పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం బెంగళూరు వేదికగా జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం విషయంలో గట్టిగానే ఆలోచన చేస్తున్నారు. నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ప్రతి వారం మూడు రోజులపాటు తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చేవారు. కానీ ఈ వారం ఆయన కనిపించలేదు. బెంగళూరు వేదికగా కీలక చర్చలు జరుపుతున్నట్లు అర్థమవుతోంది. తొలుత మద్యం కుంభకోణం కేసును చాలా ఈజీగా తీసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటేలా ఉండడంతో జగన్మోహన్ రెడ్డిలో కలవరం ప్రారంభం అయినట్లు ప్రచారం నడుస్తోంది.
Also Read: రేపు సింగపూర్ కు సీఎం చంద్రబాబు బృందం.. ఎవరెవరిని కలుస్తారంటే?!
జైలు జీవితంతోనే క్రేజ్..
అయితే జగన్మోహన్ రెడ్డికి జైలు జీవితం గొప్ప కాదు. ఒక విధంగా చెప్పాలంటే జైలు జీవితమే ఆయనకు ఈ స్టేజ్ తెచ్చి పెట్టింది. అవినీతి కేసుల్లో అరెస్టయ్యారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు 16 నెలల పాటు జైల్లో ఉండి పోయారు. అప్పటికే రాజశేఖర్ రెడ్డి ( Y S Rajasekhara Reddy ) మృతి చెంది ఉన్నారు. అనవసరంగా కక్ష సాధింపునకు దిగారని జగన్మోహన్ రెడ్డి పై విపరీతంగా సానుభూతి లభించింది. అందుకే అప్పట్లో ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు కూడా మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే.. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో సీనియర్ల అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలుస్తోంది.
అప్పట్లోనే ఎమ్మెల్యేల్లో అసంతృప్తి
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) దారుణంగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయింది. అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి హాజరు కాబోమని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. అయితే శాసనమండలి సమావేశాలకు ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. అప్పట్లోనే చాలామంది ఎమ్మెల్యేలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం తమను అసెంబ్లీలోకి వెళ్లకుండా నియంత్రించడం ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అప్పట్లోనే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూటమి పార్టీల్లో చేరుతారని కూడా తెగ ప్రచారం నడిచింది. అయితే ఇప్పటికే కూటమి అంతులేని మెజారిటీతో ఉంది. ఆ పార్టీకి సంఖ్యా బలం అవసరం లేదు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు.
Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఐపీఎస్ లకు..!
ఉప ఎన్నికలకు వెళ్తే నెగ్గ గలరా?
అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం ఉండే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలకు వెళితే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అధికారంలోకి వచ్చి కేవలం 14 నెలలు అవుతోంది. ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉందే కానీ వ్యతిరేకత లేదు. అది తేలాలంటే కొద్ది సమయం పడుతుంది. మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో మూడు పార్టీలు కలిసిన నడుస్తున్నాయి. ఇటువంటి తరుణంలో సాహసం చేస్తే అసలుకే ఎసరు వస్తుందని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అప్పట్లో ఉండే పరిస్థితి వేరు… ఇప్పటి పరిస్థితి వేరు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ సాహసం చేయరని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.