Prime Minister Modi : భారత ప్రధాని వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ విదేశీ పర్యటనలతో స్పీడ్ పెంచారు. మూడోసారి బాధ్యతలు చేపట్టిన నాలుగు రోజులకే ఇటలీలో జరిగిన జీ7 దేశాల సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. తర్వాత మన మిత్రదేశమైన రష్యాలో మూడు రోజులు పర్యటించారు. అనేక కీలక అంశాలపై చర్చించారు. రష్యా సైన్యంలో చిక్కుకున్న భారతీయులను విడుదల చేయాలని కోరారు. ఇందుకు పుతిన్ కూడా అంగీకరించారు. ఈ పర్యటనపై ఉక్రెయిన్ ప్రధాని జెలన్‌స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ, పుతిన్ ఆలింగనంపై అసహనం వ్యక్తం చేశారు. యుద్ధం ఆపాల్సిన సమయంలో రష్యాలో మోదీ పర్యటనను తప్పు పట్టారు. అయితే ఇటీలీ పర్యటన సందర్భంగా మోదీతో సమావేశమైన జెలన్‌స్కీ ఉక్రెయిన్ రావాలని మోదీని ఆహ్వానించారు. దీనికి మోదీ కూడా అంగీకరించారు. ఈమేరకు ఆయన తాజాగా ఉక్రెయిన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆగస్టు 21 నుంచి మూడో రోజులు పోలాండ్, ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. దీంతో మోదీ ఈసారి ఏం స్కెచ్ వేశాడు.. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ఆపేస్తాడా? యుద్ధవాతావరణంలో మోదీ టూర్‌పై అంతటా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్న అగ్రరాజ్యం అమెరికాతోపాటు, భారత మిత్రదేశం రష్యా కూడా మోదీ పర్యటనను నిశితంగా గమనించనుంది.
45 ఏళ్ల తర్వాత ఆ దేశానికి..
ఇదిలా ఉంటే.. భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం ఓ రికార్డు. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్ వెళ్తున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి (పశ్చిమ) తన్మయ్ లాల్ తెలిపారు. ఇరు దేశాలు దౌత్య సంబంధాల స్థాపనకు 70 ఏళ్లు పూర్తయిన తరుణంలో ఈ పర్యటన జరుగుతోందని చెప్పారు. వార్సాలో మోదీకి లాంఛనంగా స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు. పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో మోదీ చర్చలు జరుపుతారని, ప్రెసిడెంట్ ఆండ్రెజ్ దుడాతో భేటీ అవుతారని ఆయన చెప్పారు. వార్సాలోని భారతీయ కమ్యూనిటీ, వ్యాపార ప్రముఖులు, ప్రముఖ ఇండాలజిస్టులతో కూడా ప్రధాని సంభాషించనున్నారు. జామ్‌నగర్, కొల్హాపూర్‌లతో పోలాండ్‌కు ఉన్న ప్రత్యేక సంబంధాన్ని గుర్తుచేసే స్మారక చిహ్నాలను కూడా మోదీ సందర్శిస్తారు.
30 ఏళ్ల తర్వాత ఉక్రెయిన్‌కు..
ఇక ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్సీ్క ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతారని లాల్ తెలిపారు. దౌత్య సంబంధాలు ఏర్పాటైన 30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరువురు నేతల మధ్య ఇటీవలి అత్యున్నత స్థాయి పరస్పర చర్చల ఆధారంగా ఈ పర్యటన సాగుతుంది. తర్వాత రష్యా–ఉక్రెయిన్ వివాదంపై మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ, దౌత్యం, సంభాషణలు వివాదాన్ని పరిష్కరించగలవని, శాశ్వతమైన శాంతికి దారితీయగలవని భారతదేశం చాలా స్పష్టమైన మరియు స్థిరమైన స్థితిని కొనసాగిస్తోందని, కాబట్టి సంభాషణ కచ్చితంగా అవసరమని మిస్టర్ లాల్ అన్నారు.
ఇరు దేశాలకు ఆమోదయోగ్యంగా..
ఇక ఉక్రెయిన్, రష్యాలకు ఆమోదయోగ్యంగా ఉండే చర్చలు జరుపడం ద్వారా ఇరు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. ఇటీవలే రష్యా పర్యటన సమయంలోనూ పుతిన్‌తో ఈ విషయం స్పష్టం చేశారు. ఇప్పుడు ఉక్రెయిన్ పర్యటనలోనూ ఇదే విషయాన్ని జెలన్‌స్కీకి తెలియజేయనున్నారు. ఈమేరకు చర్చలకు తాము మధ్యవర్తిత్వం వహిస్తామని కూడా చెబుతారని తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల నేతలతో ప్రధాని మోదీ చర్చలు జరిపారని కార్యదర్శి తెలిపారు. ఈ సంక్లిష్ట సమస్యకు శాంతియుత పరిష్కారాలను కనుగొనడంలో సహాయం చేయడానికి అవసరమైన అన్ని రకాల మద్దతు, సహకారాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని మిస్టర్ లాల్ పేర్కొన్నారు.