American Banks Closing: మొన్న సిలికాన్ వ్యాలీ.. నిన్న సిగ్నేచర్.. నేడు ఫస్ట్ రిపబ్లిక్.. అగ్ర రాజ్యం అమెరికాలో ఇలా ప్రముఖ బ్యాంకులన్నీ ఒక్కొక్కటి మూత పడుతున్నాయి. ప్రపంచంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం, క్రిప్టో కరెన్సీ లావాదేవీలు. తదితర కారణాలతో బ్యాంకులు దివాలా తీస్తున్నాయి. దీంతో వీటిని నిర్వహించలేక మేనేజ్మెంట్ పూర్తిగా మూసేస్తున్నాయి. ఇతర దేశాలకు ఆదర్శంగా ఉండాల్సిన అమెరికాలో ఇలాంటి సమస్య రావడంతో మిగతా దేశాల్లోనూ ఆందోళన వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? బ్యాంకింగ్ వ్యవస్థ ఎందుకు దెబ్బ తింటోంది? అన్న చర్చ ప్రపంచ వ్యాప్తంగా సాగుతోంది.
దేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు కీలకమైనవి. డిపాజిట్లను సేకరించి వాటి విలువను పెంచేందుకు తోడ్పడుతాయి. ఈ క్రమంలో బ్యాంకుల ఆస్తులను బాండ్ల రూపంలోకి మార్చి మార్కెట్లోకి విడుదల చేస్తాయి. ఈ సమయంలో వడ్డీ రేట్లు పెరిగి బాండ్ల విలువ పడిపోతే బ్యాంకులు అప్పుల్లో కూరుకుపోతాయి. దీని వల్ల మార్కెట్లో ప్రతిస్పందనలు మొదలవుతాయి. అప్పుడు డిపాజిట్లదారుల నుంచి ఆసక్తి తగ్గుతుంది. ఫలితంగా బ్యాంకులు తమ వ్యాపారాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉండదు.
అమెరికాలోని సిలికాన్ బ్యాంకు విషయానికొస్తే.. ఈ బ్యాంకు మొదట్లో మంచి లాభాలు తెచ్చుకుంది. అయితే యూఎస్ బాండ్స్, టెక్నాలజీ, స్టార్ట్ అప్ లపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం.. ద్రవ్యోల్భణాన్ని అదుపు చేయలేకపోవడం ఈ బ్యాంకు పతనానికి కారణమని తెలుస్తోంది. ఇవే కాకుండా గత సంవత్సరం నుంచి వరుసగా వడ్డీ రేట్లు పెంచడంతో కస్టమర్లు తీవ్ర నిరాశ చెందుతూ వస్తున్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్భణం నుంచి తట్టుకునేందుకు వడ్డీరేట్లు విపరీతంగా పెంచడంతో యూఎస్ బాండ్ల విలువ విపరీతంగా పడిపోయింది. ఫలితంగా బ్యాంకు తీవ్రంగా నష్టపోయింది.
అమెరికాలో ఉన్న అతిపెద్ద బ్యాంకుల్లో ‘సిగ్నేచర్’ బ్యాంకు 16వ స్థానంలో ఉంది. సిగ్నేచర్ బ్యాంకును ‘ది ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ’ తన నియంత్రణలోకి తీసుకుంది. గతేడాది ముగిసే సమయానికి ఈ బ్యాంకు 110.36 బిలియన్ డాలర్ల ఆస్తులు, 88.59 బిలియన్ల డిపాజిట్లు ఉన్నాయి. అయితే ఈ బ్యాంకు క్రిప్టో కరెన్సీతోఎక్కువగా సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. క్రిప్టో ఆధారిత డిపాజిట్లను త్వరలో 8 బిలియన్ డాలర్లకు కుదించుకుంటామని గత డిసెంబర్లో ప్రకటించింది.
తాజాగా కాలిఫోర్నియాలోని ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ మూతపడింది. అమెరికాలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఇది 14వది. ఏప్రిల్ 13 నాటికి బ్యాంకు ఆస్తులు 229 బిలియన్ డాలర్లు, 104 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. సాధారణంగా ఈ బ్యాంకు ఉన్నత వర్గానికి చెందిన వారికి మాత్రమే రుణాలు ఇస్తూ వస్తోంది. అయితే చాలా మంది రుణాలను ఎగవేసినట్లు సమాచారం. దీంతో 2023 మార్చి 12 నాటికి 67 శాతం షేర్లు పడిపోయాయి. అటు స్టాక్ మార్కెట్లలో షేర్ల పతనం ఆగలేదు. దీంతో ఈ బ్యాంకును మూసివేస్తున్నట్లు ఏప్రిల్ 30న ప్రకటించింది.
మూడు నెలల్లోనే అతిపెద్ద 3 బ్యాంకులు మూతపడడంతో అమెరికా నియంత్రణ సంస్థలు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును పేజీ మోర్గాన్ ఛేస్ బ్యాంకులో విలీనం చేసేందుకు నిర్ణయించాయి. మరోవైపు ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుపుతోంది. అయితే ద్రవ్యోల్భణం నియత్రణకు బ్యాంకులు తీసుకుంటున్న నిర్ణయాలే వాటి పతనానికి కారణమవుతున్నాయని తెలుస్తోంది. ఈ తరుణంలో బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టిన వారిలో ఆందోళన పెరిగిపోతోంది.