US Presidential Election: గ్లోబల్ మీడియాలో వెలుబడుతున్న కథనాల ప్రకారం స్వింగ్ స్టేట్స్ లో ఇప్పటివరకు రిపబ్లికన్లు సత్తా చాటినట్టు తెలుస్తోంది. ఫలితాలు కూడా అదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇక్కడ ఏడుచోట్ల ఐదు స్టేట్స్ లో ట్రంప్ ముందు వరసలో ఉన్నారు. ఒకచోట మాత్రమే కమల సత్తా చాటారు. ఇంకో స్టేట్ లో ఫలితం ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. అమెరికా తలరాతను స్వింగ్ స్టేట్స్ నిర్ణయిస్తాయనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇప్పటివరకు వెలబడిన ఫలితాల ప్రకారం చూసుకుంటే రిపబ్లికన్ పార్టీ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. 5 రాష్ట్రాలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి స్వల్ప లీడ్ లో ఉన్నట్టు సమాచారం. ఇక కొన్ని ప్రాంతాలలో విజయం ఇరు పక్షాల మధ్య దోబూచులాడుతోంది. ఇక ఇప్పటివరకు 230 స్థానాలలో ట్రంప్ విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఇదే ఊపు స్వింగ్ స్టేట్స్ లోనూ ఆయన కొనసాగిస్తే అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవడం నల్లేరు మీద నడకే అవుతుంది.
పెన్సిల్వేనియాలో..
స్వింగ్ స్టేట్స్ లో ప్రముఖమైన పెన్సిల్వేనియాలో ముందుగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమల లీడ్ లో ఉన్నారు. ఆ తర్వాత రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పుంజుకున్నారు. అనంతరం ఆమెను దాటేశారు. పాపులర్ ఓట్ విభాగంలో ట్రంప్ ఏకంగా రెండు లక్షల ఓట్లు సాధించారు. ఒకవేళ ఇక్కడ విజయం సాధిస్తే డెమోక్రట్లకు 19 ఎలక్టోరల్ ఓట్లు దక్కుతాయి. అయితే ఇక్కడ ఇప్పటికే 77% ఓటింగ్ పూర్తయింది.
జార్జియాలో..
జార్జియాలో మొత్తం 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభమైన సమయం నాటి నుంచి ట్రంప్ స్వల్ప లీడ్ లో ఉన్నారు.. పాపులర్ ఓట్ల విభాగంలో దాదాపు లక్షకుపైగా ఓట్లను ట్రంప్ సాధించారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 91% కౌంటింగ్ పూర్తయింది.
విస్కాన్సిన్ లో
విస్కాన్సిన్ ప్రాంతంలో 65% కౌంటింగ్ పూర్తయింది. ఇప్పటివరకు ట్రంప్ దాదాపు 1,00,000 ఓట్ల లీడ్ లో కొనసాగుతున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 10 ఎలక్టోరల్ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రారంభం నుంచి రిపబ్లికన్లు సత్తా చాటుతున్నారు.
మిషిగన్ లో..
మిషిగన్ ప్రాంతంలో ఇప్పటివరకు 36% కౌంటింగ్ పూర్తయింది. ఈ ప్రాంతంలో తొలి రౌండ్ నుంచి ట్రంప్ లీడ్ కొనసాగించడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు రిపబ్లికన్లు లక్షన్నరకు పైగా ఓట్ల లీడ్ లో ఉన్నారు. ట్రంప్ 51 శాతం, కమల 46% ఓట్లు సాధించారు. ఇక్కడ 15 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.
నార్త్ కరోలినా రాష్ట్రంలో..
నార్త్ కరోలినా రాష్ట్రంలో ట్రంప్ విజయం సాధించినట్టే. ఇక్కడ 89% కౌంటింగ్ పూర్తయింది. ట్రంప్ కు 25,81,584 ఓట్లు లభించాయి. కమలకు 24,45,460 ఓట్లు దక్కాయి. ఇక్కడ 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.
అరిజోనాలో..
అరిజోనా రాష్ట్రంలో 50% ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇక్కడ రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల మధ్య హోరాహోరి కొనసాగుతోంది. ట్రంప్ 9,04,351, కమల 9,01,995 ఓట్లు లభించాయి. ఇద్దరి మధ్య 0.2 శాతం ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. అయితే ఇక్కడ ఫలితాలు తారు మారు కావడానికి ఎంతో సమయం పట్టదని విశ్లేషకులు అంటున్నారు.
ఇక చివరిదైన నెవడా రాష్ట్రంలో ఫలితాలు ఇంకా వెల్లడించలేదు.