US President Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏడు నెలల క్రితం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సమయంలో డెమొక్రటిక్ పార్టీని ఓడించేందుకు చాలా మంది ట్రంప్‌కు మద్దతు తెలిపారు. రిపబ్లిక్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. సొంతంగా నిధులు ఖర్చు చేశారు. నిధుల సమీకరణకు సహకరించారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఆయన ఒక్కడి కృషితోనే సాధ్యం కాలేదు. అయితే ఎన్నికల సమయం వరకు మిత్రులగా ఉండి ఆయన గెలుపులో భాగమైన చాలా మంది.. ట్రంప్ 2.0 పాలన చూసి శత్రువులుగా మారుతున్నారు. ఆయన పాలనా విధానాలను, నిర్ణయాలను బహిరంగంగా ఖండిస్తున్నారు. ఎలాన్ మస్క్, మైక్ పెన్స్, జాన్ బోల్టన్ వంటి మాజీ సన్నిహితులు ట్రంప్ విధానాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఎలాన్ మస్క్..
ఎలాన్ మస్క్, ట్రంప్ ఎన్నికల విజయంలో కీలక ఆర్థిక, సామాజిక మద్దతు అందించాడు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, మస్క్ కోసం ప్రత్యేకంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) ఏర్పాటు చేసి దానికి అధినేతగా నియమించాడు ట్రంప్. అయితే బిగ్ బ్యూటిఫుల్ చట్టం, ఇతర విధానాలపై అసంతృప్తితో మస్క్ ఈ పదవికి రాజీనామా చేశాడు. ట్రంప్‌పై సెక్స్ కుంభకోణం ఆరోపణలు చేయడం, కొత్త పార్టీ ఏర్పాటు ఆలోచనలు వ్యక్తం చేయడం ద్వారా విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. దీనికి ప్రతిగా, ట్రంప్ మస్క్ కంపెనీలపై బిలియన్ డాలర్ల కాంట్రాక్టులను రద్దు చేస్తానని హెచ్చరించాడు,
మైక్ పెన్స్..
మైక్ పెన్స్, ట్రంప్ మొదటి పదవీకాలంలో (2017-2021) ఉపాధ్యక్షుడిగా సేవలందించాడు. సైనిక వ్యవహారాలపై కీలక సలహాలు ఇచ్చాడు. అయితే, 2020 ఎన్నికల్లో జో బైడెన్ విజయాన్ని సర్టిఫై చేయమని ట్రంప్ చేసిన అనైతిక ఒత్తిడిని పెన్స్ తిరస్కరించడంతో వారి సంబంధాలు దెబ్బతిన్నాయి. 2021, జనవరి 6న క్యాపిటల్ హిల్ దాడి సమయంలో ట్రంప్ మద్దతుదారులు పెన్స్‌ను లక్ష్యంగా చేసుకోవడం వారి విభేదాలను మరింత బహిర్గతం చేసింది. పెన్స్, ట్రంప్‌ను రాజ్యాంగ వ్యతిరేకిగా విమర్శిస్తూ, అతను అధ్యక్ష పదవికి అనర్హుడని పేర్కొన్నాడు.
జాన్ బోల్టన్..
జాతీయ భద్రతా సలహాదారుడిగా (2018-2019) పనిచేసిన బోల్టన్, ఇరాన్, ఉత్తర కొరియా విధానాలపై ట్రంప్‌తో విభేదించి రాజీనామా చేశాడు. రెండో పదవీకాలంలో ట్రంప్ బోల్టన్ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేయడం వారి శత్రుత్వాన్ని స్పష్టం చేసింది.
జాన్ కెల్లీ..
చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా (2017-2019) పనిచేసిన కెల్లీ, ట్రంప్‌ను ‘‘ఫాసిస్టు, నియంత’’గా విమర్శించాడు, ఆయన నిర్ణయాలను తీవ్రంగా ఖండించాడు.
జిమ్ మ్యాటిస్..
రక్షణ మంత్రిగా (2017-2019) సేవలందించిన మ్యాటిస్, సిరియా నుంచి సైనిక ఉపసంహరణ నిర్ణయాన్ని వ్యతిరేకించి రాజీనామా చేశాడు. ట్రంప్‌ను అమెరికన్ ప్రజలను ఏకం చేయలేని నాయకుడిగా విమర్శించాడు.
మార్క్ మిల్లే..
జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్‌గా (2015-2019) పనిచేసిన మిల్లే, ట్రంప్‌ను ‘‘ఫాసిస్టు, అమెరికాకు అత్యంత ప్రమాదకర వ్యక్తి’’గా అభివర్ణించాడు.
ట్రంప్ విధానాలే కారణం..
ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ చట్టం, విదేశాంగ విధానాలు, అమెరికా సైనిక వ్యవహారాలపై తీసుకున్న నిర్ణయాలు విమర్శలకు దారితీశాయి. ఈ విధానాలు, ముఖ్యంగా ఆర్థిక వ్యయ నియంత్రణ, సైనిక ఉపసంహరణలు, అంతర్జాతీయ సంబంధాలపై నిర్ణయాలు, ఆయన మాజీ సన్నిహితులను దూరం చేశాయి. ఈ విభేదాలు రిపబ్లికన్ పార్టీలో అంతర్గత చీలికలను సృష్టిస్తున్నాయి, ఇది ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చు.