US Minister Hegseth : యెమెన్(Yemen)లో హూతీ తిరుగుబాటుదారులపై అమెరికా ఇటీవల చేపట్టిన వైమానిక దాడులు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ఈ దాడులకు సంబంధించిన రహస్య ప్రణాళికలు ముందుగానే బహిర్గతం కావడం, తాజాగా అమెరికా(America) రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తన కుటుంబ సభ్యులతో ఈ వివరాలను పంచుకున్నట్లు వెల్లడి కావడం సంచలనం రేపింది. 2025 మార్చిలో యెమెన్‌పై దాడులకు ముందు, హెగ్సెత్ సిగ్నల్ యాప్(Signal aap)లోని రెండు గ్రూప్ చాట్‌ల ద్వారా సున్నితమైన సమాచారాన్ని బయటపెట్టినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. మొదటి చాట్‌లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర అధికారులతోపాటు ‘ద అట్లాంటిక్’ ఎడిటర్ జెఫ్రీ గోల్డ్‌బర్గ్ ఉన్నారు. రెండో చాట్‌లో హెగ్సెత్ తన భార్య జెన్సిఫర్, సోదరుడు ఫిల్ హెగ్సెత్, వ్యక్తిగత న్యాయవాదితో ఈ వివరాలను చర్చించారు. జెన్సిఫర్ గతంలో ఫాక్స్ న్యూస్‌లో నిర్మాతగా, ఫిల్ హోంల్యాండ్ శాఖలో సీనియర్ సలహాదారుగా పనిచేస్తున్నారు.
Also Read : అమెరికా అధ్యక్షుడికి షాక్.. వారి బహిష్కరణకు సుప్రీం కోర్టు బ్రేక్!
పెంటగాన్, వైట్ హౌస్ నిశ్శబ్దం
ఈ లీక్‌లపై పెంటగాన్, వైట్ హౌస్ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు. గతంలో హెగ్సెత్ రక్షణ శాఖ సమావేశాలకు కుటుంబ సభ్యులను తీసుకెళ్లినట్లు కథనాలు వచ్చాయి, ఇది ఆయనపై విమర్శలకు దారితీసింది. ప్రతిపక్ష డెమోక్రాట్లు హెగ్సెత్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు, ట్రంప్(Trump) పరిపాలన రహస్య సమాచార నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
సనాలో తాజా దాడులు
ఈ వివాదాల మధ్య, సోమవారం తెల్లవారుజామున యెమెన్ రాజధాని సనాలో అమెరికా మరోసారి వైమానిక దాడులు చేసింది. హూతీల నియంత్రణలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ దాడుల్లో 12 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు. ఈ ఘటన యెమెన్‌లో ఉద్రిక్తతలను మరింత పెంచింది.
రక్షణ మంత్రి హెగ్సెత్ చర్యలు అమెరికా జాతీయ భద్రతా వ్యవస్థలపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఈ లీక్‌లు దాడుల సమర్థతను ప్రభావితం చేయకపోయినప్పటికీ, రహస్య సమాచార నిర్వహణలో లోటుపాట్లను బహిర్గతం చేశాయి. ఈ విషయంపై తదుపరి చర్యలు ట్రంప్ పరిపాలన రాజకీయ, సైనిక విశ్వసనీయతను ప్రభావితం చేయవచ్చు.
Also Read : రష్యా–ఉక్రెయిన్ మధ్య ఈస్టర్ సంధి.. సడెన్‌గా కాల్పుల విరమణ..