US China Tariff War: అమెరికా(America) నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై చైనా(China) ఇటీవల 34 శాతం అదనపు సుంకాలను విధించాలని నిర్ణయించింది. ఇది ఇప్పటికే ఉన్న అమెరికా టారిఫ్‌లకు ప్రతీకార చర్యగా భావిస్తున్నారు. ఈ నిర్ణయం వాణిజ్య యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేలా కనిపిస్తోంది. చైనా గతంలోనూ కంపెనీలకు అక్రమ రాయితీలు, కరెన్సీ అవకతవకలతో అమెరికాపై ఒత్తిడి పెంచుతోందని ఆరోపణలు ఉన్నాయి.
Also Read: అగ్రరాజ్యంలో ప్రతీకార సుంకాలు.. ఏపీలో ఆక్వా రంగం కుదేలు!
ట్రంప్ హెచ్చరికలు..
ఈ చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీవ్రంగా స్పందించారు. ఏప్రిల్ 8 నాటికి చైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు. లేకపోతే, ఏప్రిల్ 9 నుంచి చైనా వస్తువులపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అంతేకాదు, చైనాతో అన్ని చర్చలను రద్దు చేస్తామని సామాజిక మాధ్యమాల ద్వారా స్పష్టం చేశారు. ‘చైనా తన 34% సుంకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, మరిన్ని టారిఫ్‌లను ఎదుర్కోవాల్సి వస్తుంది‘ అని ట్రంప్ హెచ్చరించారు.
డబ్ల్యూటీవోకు చైనా ఫిర్యాదు
అంతకుముందు అమెరికా విధించిన 34% సుంకాలకు బదులుగా చైనా కూడా దీటుగా స్పందించింది. అమెరికాకు చెందిన 16 సంస్థలకు రెండు విధాలా ఉపయోగపడే వస్తువుల ఎగుమతిపై నిషేధం విధించింది. అరుదైన ఖనిజాల ఎగుమతులపై నియంత్రణలు ప్రకటించి, అమెరికా రక్షణ, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుంది. అదనంగా, అమెరికా సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో వ్యాజ్యం దాఖలు చేసింది.
వాణిజ్య యుద్ధం ప్రభావం
రెండు అగ్రరాజ్యాల మధ్య ఈ సుంకాల సమరం ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చైనా తన వైఖరిని మార్చుకోకపోతే, ట్రంప్ మరింత కఠిన చర్యలకు దిగే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది.