https://oktelugu.com/

US attack : ఓవైపు హిజ్ బొల్లా.. ఇజ్రాయిల్ పోరు సాగుతుంటే.. అమెరికా తన పని మొదలుపెట్టింది.. ఆ దేశంపై దాడులు చేసింది..

పశ్చిమసియాలో ఇప్పటికే ఉద్రిక్తత నెలకొంది. ఓ వైపు హిజ్ బొల్లా పై ఇజ్రాయిల్ పోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే వైమానిక దాడులను చేసింది. హిజ్ బొల్లా చీఫ్, అతడి కుమార్తెను హతమార్చింది.

Written By:
  • NARESH
  • , Updated On : September 29, 2024 / 10:41 PM IST
    Follow us on

    US attack : హిజ్ బొల్లా పై ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో పశ్చిమసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే సిరియాపై అమెరికా దాడులు మొదలు పెట్టింది. అమెరికా బలగాలు సిరియా పైన విరుచుకుపడుతున్నాయి. ఇప్పటివరకు తాము జరిపిన వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులు చనిపోయారని అమెరికా వెల్లడించింది. వీరంతా కూడా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, ఆల్ ఖైదా అనుబంధ సంస్థలకు చెందిన వారిని వివరించింది. చనిపోయిన వారిలో ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నాయకులు ఉన్నారని పేర్కొంది.. ఆల్ ఖైదా కు అనుబంధంగా ఉన్న హుర్రాస్ ఆల్ దీన్ గ్రూప్ కు చెందిన సీనియర్ ఉగ్రవాది.. మరో ఎనిమిది మందిని టార్గెట్ గా అమెరికా దాడులు చేసింది. వాయవ్య సిరియా ప్రాంతంలో వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 37 మంది హతమయ్యారు. అందులో ఓ సీనియర్ ఉగ్రవాది అమెరికాకు వ్యతిరేకంగా… ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కు చెందిన ఫైటర్లకు శిక్షణ ఇస్తున్నాడు. అయితే తమ నిఘా వర్గాల ద్వారా ఈ సమాచారం తెలియడంతో అమెరికా అప్రమత్తమయింది. వెంటనే దాడులకు రంగం సిద్ధం చేసింది.
    అత్యధిక ఆయుధ సామగ్రితో వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ శక్తి సామర్థ్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అమెరికా వెల్లడించింది. ” మా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదు. మిత్రపక్షలకు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తే సహించేది లేదు. ప్రపంచ వ్యాప్తంగా శాంతికి విఘాతం కలిగించే పనులు చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుంది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ మాత్రమే కాదు.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఎవరికైనా ఇదే గతి పడుతుందని” అమెరికా హెచ్చరించింది. అయితే సిరియా నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోయిన తర్వాత ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ భారీగా భూభాగాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే ఇటీవల మళ్ళీ కార్యకలాపాలు ప్రారంభించినట్టు అమెరికాకు సమాచారం అందింది. దీంతో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ విస్తరించకుండా ఉండడానికి అమెరికా దాడులు మొదలు పెట్టింది. ఏకంగా 37 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు ప్రకటించింది. అమెరికా దాడులు నేపథ్యంలో సిరియాలో దాదాపు 900 మంది భద్రతా సిబ్బందిని నియమించింది. అక్కడ వారు విస్తృతంగా తనిఖీలు మొదలుపెట్టారు. ఉగ్రవాదులను హతమార్చుకుంటూనే.. బంకర్లు, సెల్లార్లు, ఇతర నిర్మాణాలలో ఉగ్రవాదుల జాడ కోసం తనిఖీలు చేస్తున్నారు. మొత్తంగా అటు హిజ్ బొల్లా పై ఇజ్రాయిల్ దాడులు చేస్తుండడం.. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఉగ్రవాదులను ఏరి పారేయడానికి అమెరికా సిరియాపై దాడులు చేస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే భయం సర్వత్రా వ్యక్తమవుతోంది.