Typhoon Bebinca : చైనాపై ప్రకృతి ప్రకోపం.. వరుస తుఫాన్లతో అల్లకల్లోలం.. షాంఘై ని వణికిస్తున్న బెబింకా

చైనాపై ప్రకృతి ప్రకోపాన్ని ప్రదర్శిస్తోంది.. వరుస విపత్తులతో నరకం చూపిస్తోంది. కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఆ దేశంలో అన్ని వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : September 16, 2024 6:35 pm
Follow us on

Typhoon Bebinca : చైనాలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 16 తుఫాన్లు ఏర్పడ్డాయి. ఇవి డ్రాగన్ దేశానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న తుఫాన్లను మర్చిపోకముందే బెబింకా తుఫాన్ చైనాలోని షాంఘై నగరాన్ని ముంచేసింది. విపరీతమైన వర్షాలు, తీవ్రాతితీవ్రమైన గాలులు, చుట్టుముట్టిన వరదలతో షాంఘై నగరం నిండా మునిగింది. ఫలితంగా ఆ ప్రాంతం ద్వీపకల్పం లాగా కనిపిస్తోంది. తుఫాన్ నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు అక్కడి అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. బెబింకా తుఫాన్ సృష్టిస్తున్న విలయం తాలూకు దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. ఒక వ్యక్తి గాలి తీవ్రతకు కొట్టుకుపోతున్నట్టు కనిపించాడు. ఒక షాపింగ్ మాల్ పైనుంచి భారీ హోర్డింగ్ కింద పడింది. ఒక కాలనీలో చూస్తుండగానే పిడుగుపాటు చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో భారీగా మంటలు చెలరేగాయి. ఓ గేటెడ్ కమ్యూనిటీలో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక నగరంలోని లోతట్టు ప్రాంతం మొత్తం ఒక సముద్రాన్ని తలపిస్తోంది. నిండుగా నీరు అలలు అలలుగా వస్తోంది. విమానాశ్రయంలో వరద నీరు చేరడంతో అనేక అభిమానాలను రద్దు చేశారు. చైనా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సోమవారం బెబింకా తుఫాను షాంఘై తీరాన్ని దాటిందని తెలుస్తోంది.. దాదాపు 75 సంవత్సరాల తర్వాత చైనా ఆర్థిక నగరంలో ఈ స్థాయిలో వర్షం ఎప్పుడూ చూడలేదని అక్కడి ప్రజలు అంటున్నారు..

గంటకు 151 కిలోమీటర్ల వేగంతో..

బెబింకా తుఫాన్ వల్ల గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో నగరం మొత్తం అతలాకుతులమవుతోంది. జనజీవనం అధ్వానంగా మారింది. గాలుల తీవ్రత వల్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ప్రజలకు కనీసం అత్యవసర వస్తువులు కూడా సరఫరా చేసే పరిస్థితి లేదు.. దీంతో అక్కడి ప్రభుత్వం ప్రజలను బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇంట్లోనే ఉండాలని సూచించింది. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని.. నీటి కాలువల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించింది. సాధ్యమైనంతవరకు బయటికి వెళ్లకపోవడమే మంచిదని సూచించింది.

బెబింకా తుఫాన్ వల్ల వందల కోట్ల నష్టం వాటిలిందని చైనా అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఇటీవల కూడా చైనా దేశాన్ని తుఫాన్ కకావికలం చేసింది. పలు ప్రాంతాలను నీట ముంచింది. అప్పుడు కూడా భారీ నుంచి అతి భారీ గాలులు వీచాయి. బహుళ అంతస్తుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. హోర్డింగులు కూలిపోయాయి. చెట్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఆ నష్టం నుంచే చైనా ఇంకా తేరుకోలేదు. మళ్లీ ఇంతలోనే ఈ తుఫాన్ ఏర్పడటంతో చైనా దేశం వణికిపోతోంది.