Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మెజారిటీ ఎలక్టోరల్ ఓట్లు సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విసయం సాధించారు. శనివారం నాటికి 301 సీట్లు సాధించిన ట్రంప్.. తిరుగులేని మెజారిటీతో అగ్రరాజ్యానికి 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే ఫలితాలపై స్పష్టత వచ్చినా.. ఇంకా అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నాయి. తాజాగా నెవెడా, ఆరిజోనా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఏడు స్వింగ్ స్టేట్స్‌లోని ఈ రెండు రాష్ట్రాలు కూడా ట్రంప్ ఖాతాలోనే చేరాయి. ఆరిజోనాలో ఉన్న 11 ఎలక్టోరల్ ఓట్లను ట్రంప్ గెలుచుకున్నారు. దీంతో ట్రంప్ మెజారిటీ 312కు పెరిగింది. ఇక అధికార డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మెజారిటీ 226కే పరిమితమైంది.
ఏడు ఆయన ఖాతాలోనే..
ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేవి ఏడు స్వింగ్ రాష్ట్రాలే. 50 రాష్ట్రాలు ఉన్న అమెరికాలో కొన్ని డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాష్ట్రాలు రిపబ్లికన్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఏడు స్వింగ్ రాష్ట్రాలు మాత్రం తరచూ తమ నిర్ణయాన్ని మార్చుకుంటాయి. ఈ రాష్ట్రాలు ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు. 2020 ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్ ఓటర్లు డెమోక్రటిక్ పార్టీవైపు నిలిచాయి. దీంతో జో బైడెన్ అధ్యక్షుడయ్యాడు. తాజా ఎన్నికల్లో ఈ ఏడు రాష్ట్రాలు కూడా రిపబ్లిక్ పార్టీవైపు మొగ్గాయి. దీంతో భారీ మెజారిటీతో ట్రంప్ విజయం సాధించారు. ఇక ఆరిజోనాను 2016లో గెలిచిన ట్రంప్.. 2020లో ఓడిపోయాడు. తిరిగి 2024లో దానిని దక్కించుకున్నారు.
ట్రంప్ రికార్డు..
ఇదిలా ఉంటే.. అమెరికా చరిత్రలోనే ట్రంప్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఏడు స్వింగ్ రాష్ట్రాలను గెలిచిన నేతగా నిలిచాడు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నవంబర్ 6న వెలువడ్డాయి. కానీ, నెవెడా, ఆరిజోనా ఫలితాలు మాత్రం ఆలస్యమయ్యాయి. నాలుగు రోజుల తర్వాత ఫలితాలు అధికారికంగా వెల్లడయ్యాయి. ట్రంప్ అధ్యక్షుడిగా జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు.