Trump threatens tariffs: అమెరికా ఫస్ట్ నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్.. తన దేశం కోసం ఏదో చేస్తున్నట్లుగా సంచలన నిర్ణయాలు తీసుకుంటు ఇటు అమెరికన్లను అటు ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతున్నాడు. ఏడాది పాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదమయ్యాయి. కొన్నింటిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. తనకు లేని అధికారం ఆపాదించుకుని ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. దీంతో అమెరికాకు ఎగుమతులు చేసే దేశాలపై భారం పడింది. అదేసమయంలో అమెరికాలో వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో అమెరికన్ల సగటు నెలవారీ బడ్జెట్ భారం 1500 డాలర్లు పెరిగింది. ఇక భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందన్న సాకుతో 25 శాతం అదనపు సుంకాలు విధించారు.
ఈసారి వ్యవసాయ ఉత్పత్తులపై
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేశీయ రైతుల డిమాండ్ మేరకు ఇప్పుడు భారత్, కెనడా వ్యవసాయ ఉత్పత్తులపై కొత్త సుంకాలు విధించే ఆలోచనలో ఉన్నారు. సబ్సిడీలతో తక్కువ ధరలకు దిగుమతులు అమెరికా మార్కెట్లను దెబ్బతీస్తున్నాయని రైతులు వైట్ హౌస్ సమావేశంలో ఆరోపించారు. ఈ డంపింగ్‌తో దేశీయ ధరలు పడిపోతూ రైతుల ఆదాయాలు తగ్గుతున్నాయని వాదించారు.
12 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయ ప్యాకేజీ…
రైతుల సమస్యలను విని ట్రంప్ రూ.1,08,000 కోట్ల సహాయం ప్రకటించారు. భారత్, థాయిలాండ్, చైనా బియ్యం డంపింగ్ ప్రధాన కారణాలని గుర్తించి, ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్‌కు దేశాల జాబితా తయారు చేయమని ఆదేశించారు. ఈ చర్యలు అమెరికా వ్యవసాయ రంగాన్ని రక్షించే దిశగా ఉన్నాయి.
భారత్‌పై దృష్టి..
లూసియానా రైస్ మిల్ సీఈవోమెరిల్ కెన్నెడీ భారత్ సబ్సిడీలు చట్టవిరుద్ధమని, చైనా బియ్యం ప్యూర్టో రికో మార్గంలో వస్తున్నట్లు వివరించారు. ట్రంప్ ఈ ఆరోపణలకు స్పందిస్తూ అన్యదేశాలు అమెరికాను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ నిర్ణయం భారత వ్యవసాయ ఎగుమతులకు సవాల్‌గా మారనుంది.
కెనడా, భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు ఆలోచించే సమయంలో ఈ పరిణామం జరిగింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయ బృందం త్వరలో భారత్‌తో చర్చలు పునఃప్రారంభించనుంది. సంవత్సర చివరికి మొదటి దశ ఒప్పందం పూర్తి చేయాలని భారత్ భావిస్తోంది.