Visakhapatnam News: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఎన్నెన్నో విజయాలను చూసింది. 2019లో అయితే కనివిని ఎరుగని విజయంతో దేశం మొత్తం తన వైపు చూసుకునేలా చేసింది. అయితే అదే పరిస్థితి 2024లో కూడా ఎదురయింది. కానీ అది అపజయం రూపంలో. అయితే జయాపజయాలు సహజం కానీ.. కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపలేకపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. వైసిపి ఆవిర్భవించి శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ పార్లమెంటు స్థానాల్లో పట్టు సాధించలేకపోయింది. అదే సమయంలో విశాఖ నగరంలో పార్టీని విజయ తీరాల వైపు నడిపించలేకపోయింది. అయితే ఇప్పటికీ విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది అదే పరిస్థితి. ఇప్పుడు అక్కడ పార్టీని నడిపించే పెద్ద నాయకుడు ఎవరూ లేకపోవడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నిజమైన లోటు. పార్టీని నడిపించేందుకు పక్క జిల్లాకు చెందిన బొత్సను తీసుకొచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
జిల్లా నేతల పాత్ర కీలకం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో విశాఖ జిల్లా( Visakha district ) నేతల పాత్ర కీలకం. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రకటన సమయంలో ఆయన వెంట ఉండే వారు సబ్బం హరి. అటు తరువాత కొణతాల రామకృష్ణ, టిడిపిలో సీనియర్ నేతగా చలామణి అయిన దాడి వీరభద్రరావు ఇలా అందరూ క్యూ కట్టారు. అటు తరువాత చాలామంది నేతలు జగన్ గూటికి చేరారు. అయితే జగన్మోహన్ రెడ్డి దురదృష్టమో.. లేకుంటే విశాఖ సెంటిమెంట్ చెప్పలేం కానీ ఒక్కరంటే ఒక్క పెద్ద వైసీపీ నేత ఆ పార్టీలో ఇమడలేకపోయారు. ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెప్పారు. కొందరు ఎన్నికల ముందు గుడ్ బై చెప్పగా.. మరికొందరు ఎన్నికల ఫలితాలు వచ్చాక పార్టీకి టాటా చెప్పారు. ఇప్పటికీ అక్కడ పార్టీ పుంజుకోలేకపోతోంది. నడిపించే సరైన నాయకుడు లేక చతికిలపడుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
నియోజకవర్గ నేతలు సైతం..
2024 ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు తో( Avanti shrinivasa Rao ) పాటు ఓ పదిమంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. చివరకు నియోజకవర్గాల బాధ్యతలు చూసేవారు సైతం కరువయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలో పార్టీని గాడిలో పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి పడరాని కష్టాలు పడాల్సి వచ్చింది. అందుకే భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు అప్పగించారు. మరోవైపు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి ఇచ్చి జిల్లా బాధ్యతలు కట్టబెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే విశాఖకు ఇప్పుడు బొత్స దిక్కయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ పట్టు చిక్కలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎదురీదుతోంది. ఇలా ఎలా చూసుకున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి విశాఖలో కష్ట కాలమే.