Trump Tariffs (1)
Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన భారీ టారిఫ్లు ఆయన ప్రజాదరణను గణనీయంగా దెబ్బతీశాయి. బుధవారంతో ముగిసిన మూడు రోజుల సర్వే ప్రకారం, ట్రంప్‌ను అధ్యక్షుడిగా అంగీకరించే అమెరికన్ల సంఖ్య 43 శాతానికి పడిపోయింది. జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు 47 శాతంగా ఉన్న ఆమోదం మూడు నెలల్లో ఈ స్థాయికి తగ్గడం ఇదే మొదటిసారి.
Also Read: హౌతీలపై అమెరికా దాడులు.. వీడియో విడుదల చేసిన ట్రంప్
ఆర్థిక విధానాలపై అసంతృప్తి
ట్రంప్ ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, ముఖ్యంగా ఆటోమొబైల్స్, ఆటోమోటివ్ విడిభాగాలపై విధించిన భారీ సుంకాలు అమెరికన్లలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విధానాన్ని కేవలం 37 శాతం మంది మాత్రమే ఆమోదిస్తున్నారు. సర్వేలో సగానికి పైగా పాల్గొన్నవారు ఈ టారిఫ్లు తమ కుటుంబాలకు ఆర్థికంగా హాని కలిగిస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సుంకాలు స్టాక్ మార్కెట్లో అనిశ్చితిని పెంచడంతో పాటు, దీర్ఘకాలిక వాణిజ్య సంబంధాలకు కూడా విఘాతం కలిగిస్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విదేశాంగ విధానంపై వ్యతిరేకత
ట్రంప్ విదేశాంగ విధానం కూడా అమెరికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. జనవరిలో 37 శాతంగా ఉన్న ఆమోదం తాజా సర్వేలో 34 శాతానికి పడిపోయింది. ఆయన విధానాలు ప్రపంచ దేశాలతో అమెరికా సంబంధాలను మార్పు చేస్తున్నాయని, దౌత్యపరమైన నిబంధనలకు ఆటంకం కలిగిస్తున్నాయని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. అంతేకాదు, యెమెన్‌లో హౌతీ ఉగ్రవాదులపై సైనిక దాడి ప్రణాళిక సిగ్నల్ యాప్ ద్వారా లీక్ కావడం పట్ల 74 శాతం మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
వలస విధానాలకు మాత్రమే ఆమోదం
ట్రంప్ విధానాల్లో వలసదారులను తిరిగి పంపే నిర్ణయం మాత్రం కొంత ఆమోదం పొందింది. ఈ అంశంలో 48 శాతం మంది ఆయన పనితీరును సమర్థించారు. అయితే, ఇది మినహాయిస్తే, ఆర్థిక, విదేశాంగ, సైనిక విధానాల్లో ఆయన నిర్వహణ పట్ల అమెరికన్లు బాగా అసంతృప్తితో ఉన్నారు.
ట్రంప్ ప్రజాదరణకు ఎదురుదెబ్బ
ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు ఆయన ప్రజాదరణను గణనీయంగా దెబ్బతీశాయి. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో విఫలమవుతున్నారని, టారిఫ్ విధానాలు సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయని అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైనిక, విదేశాంగ విషయాల్లోనూ ఆయన తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదంగా మారడంతో, ట్రంప్ నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లుతోంది. ఈ సర్వే ఫలితాలు ట్రంప్ పరిపాలనకు కొత్త సవాళ్లను తెస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.