EU shocks Trump: రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందన్న సాకుతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం అదనపు సుంకాలు విధించారు. దీంతో ప్రస్తుతం భారత ఎగుమతులపై 50 శాతం సుంకాలు అమలవుతున్నాయి. దీంతో జువెల్లరీస్, జెమ్స్, మెడిసిన్స్, వజ్రాలు, ఆక్వా రంగాలపై ప్రభావం పడింది. దీనిని అధిగమ ఇంచేందుకు ప్రధాని మోదీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే సమయంలో జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారు. అమెరికా సుంకాలను భారత్ లెక్కచేయకపోవడంతో యురపియన్ యూనియన్(ఈయూ)పై ఒత్తిడి తెస్తున్నారు ట్రంప్. భారత్‌పై ఆంక్షలు విధించాలని హుకూం జారీ చేస్తున్నారు. అయితే, ఈయూ ఈ ప్రతిపాదనను ఆచరణలో పెట్టడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
ట్రంప్ టారిఫ్ వార్..
అమెరికా భారత్‌పై విధించిన అదనపు 25 శాతం సుంకాలు రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థికంగా సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ వచ్చాయి. ట్రంప్ ప్రభుత్వం భారత్‌ను రష్యాతో చమురు వాణిజ్యాన్ని నిలిపివేయాలని ఒత్తిడి చేస్తోంది. ఈ సుంకాలు భారత ఎగుమతులపై గణనీయమైన ప్రభావం చూపుతాయని, ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను కూడా ప్రభావితం చేశాయని భారత్ వాదిస్తోంది. అమెరికా ఈ చర్యలను రష్యాపై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు తీసుకున్న నిర్ణయం. భారత్ ఈ ఆంక్షలను ‘అన్యాయమైనవి, అసమంజసమైనవి‘ అని ఖండిస్తోంది. భారత్ తన ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాల కోసం రష్యా నుంచి చౌకైన చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
ఈయూపై ట్రంప్ ఒత్తిడి..
భారత్‌ను ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని ట్రంప్ ఐరోపా సమాఖ్య కూడా భారత్‌పై ఆంక్షలు విధించాలని కోరారు. ఈమేరకు ఒత్తిడి చేస్తున్నారు. అయితే ట్రంప్ ప్రతిపాదనను అమలు చేయడం సాధ్యం కాదని ఈయూ తేల్చిచెప్పింది. ఈయూ ఆంక్షలు విధించే ముందు సుదీర్ఘమైన దర్యాప్తు, బలమైన ఆధారాల సేకరణ అవసరమని ఒక దౌత్యవేత్త వెల్లడించారు. ప్రస్తుతం భారత్ లేదా చైనాపై టారిఫ్‌ల విధానంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. భారత్‌తో ఈయూ వాణిజ్య ఒప్పందం చివరి దశలో ఉన్న నేపథ్యంలో, టారిఫ్‌లు విధించడం ఈ ఒప్పందాన్ని ప్రమాదంలోకి నెట్టవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ టారిఫ్‌లు విధించాల్సి వచ్చినా, నిర్దిష్ట సంస్థలను లక్ష్యంగా చేసుకుని విధించే అవకాశం ఉందని మరో అధికారి పేర్కొన్నారు.
రష్యాపై ఈయూ ఆంక్షలు..
ఐరోపా సమాఖ్య ఇప్పటికే రష్యా, బెలారస్‌పై ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులపై భారీ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు మాస్కోపై ఆర్థిక ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఉద్దేశించినవి. అయితే, భారత్‌పై టారిఫ్‌ల విషయంలో ఈయూ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలను లక్ష్యంగా చేసుకునే బదులు, ఈయూ తన వాణిజ్య వ్యూహాలను సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో, ఈయూ ఆంక్షల విభాగం అధిపతి అమెరికా పర్యటన సందర్భంగా రష్యాపై ఆంక్షల సమన్వయంపై చర్చలు జరపనున్నారు, కానీ భారత్‌పై టారిఫ్‌ల విషయంలో స్పష్టమైన నిర్ణయం ఇంకా తీసుకోలేదు.
భారత్–అమెరికా సంబంధాల్లో కొత్త ఆశలు..
ఇదిలా ఉంటే ట్రంప్ ఇటీవల భారత్‌తో అభిప్రాయ భేదాలను తగ్గించుకునేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరపడానికి ఆసక్తి చూపారు. దీనికి స్పందిస్తూ, మోదీ ఇరు దేశాల మధ్య బంధం బలంగా ఉందని పేర్కొన్నారు, దీనిని ట్రంప్ రీపోస్ట్ చేశారు. ఇరు దేశాల ప్రతినిధులు వాణిజ్య ఒప్పందాన్ని ఫలవంతం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు, ఇది మరికొన్ని నెలల్లో సానుకూల ఫలితాలను ఇవ్వవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
భారత్ రష్యాతో చమురు వాణిజ్యాన్ని కొనసాగిస్తూ, అమెరికాతో వాణిజ్య సంబంధాలను కాపాడుకునేందుకు సమతుల్య విధానాన్ని అవలంబిస్తోంది. రష్యా నుంచి చౌకైన చమురు దిగుమతులు భారత ఇంధన భద్రతకు కీలకమైనవి, ఇవి దేశంలోని శుద్ధి కర్మాగారాలకు ఖర్చులను తగ్గించాయి. అదే సమయంలో, అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యం భారత ఎగుమతుల్లో 18 శాతం వాటాను కలిగి ఉంది. దీనిని వదులుకోవడం భారత్‌కు ఆర్థికంగా నష్టం. ఈ సంక్లిష్ట పరిస్థితిలో, భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ రాజకీయ, ఆర్థిక సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తోంది.