Rahul Gandhi breaking rules: కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న ఆయన సెక్యూరిటీ ఉల్లంఘనలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. గడిచిన 9 నెలల్లో ఆరుసార్లు సెక్యూరిటీ రూల్స్ ఉల్లంఘించారని ఆయన భద్రతను పర్యవేక్షిస్తున్న సీఆర్‌పీఎఫ్ తెలిపింది. ఇటీవలో బిహార్‌లో పాదయాత్ర పూర్తి చేసిన రాహుల్‌గాంధీ తాజాగా విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే సడెన్‌గా ఆయన ఫారిన్ టూర్‌పై సెక్యూరిటీ విభాగం అభ్యంతరం తెలిపింది. ఇప్పటికే ఆరుసార్లు సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది. విదేశీ పర్యనకు ముందు కనీసం 15 రోజుల ముందు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసింది.
ఏం జరిగింది?
రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జడ్–ప్లస్ భద్రతా కవచం కింద, విదేశీ పర్యటనలకు సంబంధించి కొన్ని కఠినమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యంగా, పర్యటనకు 15 రోజుల ముందు భద్రతా ఏజెన్సీలకు సమాచారం ఇవ్వాలి. పర్యటన వివరాలను అందించాలి. అయితే, 2025లో ఇటలీ, ఖతార్, లండన్, మలేషియా వంటి దేశాలకు ఆయన చేసిన పర్యటనల్లో ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఉల్లంఘనలు కేవలం సాంకేతికమైనవా లేక భద్రతా ఏజెన్సీలతో సమన్వయ లోపమా అనేది స్పష్టంగా తెలియదు. ఈ సందర్భంలో భద్రతా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ, రాహుల్ గాంధీ తమ సూచనలను పట్టించుకోవడం లేదని పీఆర్పీఎఫ్ పేర్కొంది.
ఉద్దేశపూర్వకమా, సాంకేతిక లోపమా?
రాహుల్ గాంధీ భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం వెనుక ఉద్దేశపూర్వక ఉల్లంఘనలు ఉన్నాయా లేక ఇది కేవలం సమాచార లోపమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొందరు విమర్శకులు, రాహుల్ గాంధీ తన వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడానికి ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా, ఆయన విదేశీ పర్యటనల సమయంలో ఎస్‌పీజీ(స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) సిబ్బందిని తీసుకెళ్లకుండా ప్రయాణించిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు, 2019లో కంబోడియా పర్యటన సమయంలో ఎస్‌పీజీ సిబ్బందిని తీసుకెళ్లకపోవడం వివాదాస్పదమైంది. ఈ సంఘటనలు రాహుల్ గాంధీ భద్రతా నిబంధనలపై తగిన శ్రద్ధ చూపడం లేదనే విమర్శలకు దారితీశాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ, రాహుల్ గాంధీ పర్యటనలు వ్యక్తిగతమైనవి కావచ్చని, అన్ని సందర్భాల్లో భద్రతా నిబంధనలు పాటించడం సాధ్యం కాకపోవచ్చని వాదిస్తోంది.
బీజేపీ విమర్శలు..
రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు, భద్రతా నిబంధనల ఉల్లంఘనలు రాజకీయ వివాదానికి దారితీస్తున్నాయి. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఆయన జాతీయ భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 2017లో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాహుల్ గాంధీ 100 సార్లు భద్రతా నిబంధనలను ఉల్లంఘించారని లోక్‌సభలో పేర్కొన్నారు. ఇటీవలి ఆరోపణలు కూడా ఈ విమర్శలకు కొత్త ఆజ్యం పోస్తున్నాయి. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలను ‘‘రహస్య పర్యటనలు’’గా అభివర్ణిస్తూ, ఆయన జాతీయ హితాలను విస్మరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ స్పందన..
కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా చిత్రీకరిస్తోంది. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు వ్యక్తిగతమైనవని, అవి జాతీయ భద్రతకు ఎలాంటి హాని కలిగించవని వాదిస్తోంది. 2022లో రాహుల్ గాంధీ లండన్ పర్యటన సందర్భంగా రాజకీయ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయితే, భద్రతా ఏజెన్సీలు ఈ ఉల్లంఘనలను సీరియస్‌గా పరిగణిస్తున్నాయి. రాహుల్ గాంధీకి జడ్–ప్లస్ భద్రత ఉన్న నేపథ్యంలో, ఈ ఉల్లంఘనలు ఆయన భద్రతను ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యలు జాతీయ భద్రతా విషయంలో ఈ ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.