Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ఇమ్మిగ్రేషన్‌పై తన వైఖరిని మార్చుకున్నారు. అమెరికా కాలేజీల్లో చదువుకునే భారతీయులు, విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను అధ్యక్షుడిగా గెలిస్తే.. గ్రాడ్యుయేట్లకు గ్రీన్‌కార్డు జారీ చేస్తానని చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ అమెరికన్లను వివాహం చేసుకున్న విదేశీయులకు ఆదేశ పౌరసత్వం ప్రకటించిన కొద్ది రోజులకే ట్రంప్ ఈ నిర్ణయం గురువారం(జూన్ 20)న ప్రకటించారు. భారత్ వంటి దేశాల నుంచి తెలివైన వారిని టెక్ కంపెనీలు ఎంపిక చేసుకోవడానికి సాయం చేస్తానని హామీ ఇస్తారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఇలా స్పందించారు.
ఇంకా ఏమాన్నారంటే..
‘నేను ఏమి చేయాలనుకుంటున్నాను.. ఏమి చేస్తాను అంటే, మీరు కళాశాల నుంచి గ్రాడ్యుయేట్ చేస్తారు, ఈ దేశంలో ఉండేందుకు వీలుగా మీ డిప్లొమాలో భాగంగా మీరు స్వయంచాలకంగా గ్రీన్ కార్డ్ పొందాలని నేను భావిస్తున్నాను’ అని ట్రంప్ తెలిపారు. గ్రీన్ కార్డ్ అనేది యునైటెడ్ స్టేట్స్‌లో శాశ్వత నివాసి కార్డు కోసం సాధారణంగా ఉపయోగించేది.
స్పష్టమైన హామీ..
2016లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ విదేశీయులను ముఖ్యంగా భారతీయులను వెనక్కి పంపిస్తానని ప్రకటించారు. విదేశీయుల హెచ్1బీ వీసాలు రద్దు చేస్తామని తెలిపారు. కానీ తాజాగా ఇందుకు విరుద్ధంగా గ్రీన్ కార్డు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. హెచ్–1బీ వీసా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులతో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భారత టెకీలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తాజాగా ట్రంప్ ఉద్యోగులకే కాకుండా చదువుకునే వారికి కూడా గ్రీన్‌కార్డు జారీ చేస్తామని హామీ ఇచ్చి ఆశ్చర్యపర్చారు.
ఇష్టం లేనివారు వెళ్లిపోతారు..
అమెరికాలో చదువుకుని స్వదేశం వెళ్లిపోవాలనుకునేవారు వెళ్లిపోవచ్చని ట్రంప్ తెలిపారు. అక్కడే కంపెనీలో ఉద్యోగాలు సాధించిన వారు ఉండిపోవచ్చని పేర్కొన్నారు. గ్రీన్ కార్డు ద్వారా అక్కడే ఉండే అవకాశం లభిస్తుందని వెల్లడించారు. తన నిర్ణయం అనేక కంపెనీలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు.