CM Chandrababu: ఈ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టారు. తీవ్ర భావోద్వేగం నడుమ.. ఒక విజయ గర్వంతో ఆయన హౌస్ లో అడుగుపెట్టగలిగారు. తాను చేసిన శపధాన్ని నెరవేర్చుకొని.. గౌరవ సభలో సగర్వంగా అడుగుపెట్టారు. ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించేలా, తన అభిమానుల కళ్ళల్లో ఆనంద భాష్పాలు నింపేలా చంద్రబాబు శాసనసభలో అడుగుపెట్టడం విశేషం. అధినేతకు సగర్వంగా స్వాగతిస్తూ.. ప్రజాస్వామ్యం గెలిచింది వన్ టూ సభ్యులు నినదించారు.
ఈ రాష్ట్రంలో చంద్రబాబుది అరుదైన రికార్డ్. సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు చంద్రబాబు. ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా ఉన్నది కూడా ఆయనే. ఎంతోమంది హేమా హేమీలను ఢీకొట్టారు చంద్రబాబు. కానీ గత ఐదు సంవత్సరాల్లో మాత్రం చాలా రకాల ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా శాసనసభకు దూరమయ్యారు. రెండున్నర ఏళ్ల తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగుపెట్టగలిగారు. అందుకే శాసనసభ మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు. అనంతరం శాసన సభా పక్ష నేత కార్యాలయంలో పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు.
2021 నవంబర్ 19న శాసనసభలో చంద్రబాబుకు తీవ్ర అవమాన భారం జరిగింది. తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసెంబ్లీలో అప్పటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. దానికి కొందరు వైసీపీ సభ్యులు వంత పాడారు. సభా నాయకుడిగా వారించాల్సిన అప్పటి సీఎం జగన్ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించారు. దీంతో చంద్రబాబు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తీవ్ర అవమాన భారంతో భీషణ ప్రతిజ్ఞ చేశారు.’ ఇన్నేళ్లు పరువు కోసం బతికాను. అలాంటిది ఈరోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు. కౌరవ సభ. ఇలాంటి సభలో నేను ఉండను. మళ్లీ ముఖ్యమంత్రి గానే ఈ సభలో అడుగు పెడతాను. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు. అందరికీ ఓ నమస్కారం ‘ అంటూ 2021 నవంబర్ 19న శాసనసభలో ప్రత్యేక ప్రకటన చేసి చంద్రబాబు బాయ్ కట్ చేశారు. ఆ రోజు నుంచి ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేదు. ప్రజాక్షేత్రంలోనే వైసిపి పై బదులు తీర్చుకొని… ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రి గానే సభలో అడుగుపెట్టారు.ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు టిడిపి శ్రేణులు టీవీలకు అతుక్కుపోవడం కనిపించింది.