Powerful Passports: విమాన ప్రయాణానికి పాస్ పోర్టు కీలకం. లేకుంటే నో ఎంట్రీయే. పాస్ పోర్టుతోనే వేరే దేశంలోకి వెళ్లే అనుమతి ఉంటుంది. వారికి ఎటువంటి వీసాతో పని ఉండదు. అటువంటి శక్తివంతమైన పాస్ పోర్ట్ కలిగిన దేశాలు ఏవి? ఆ జాబితాలో మన భారతదేశం ఎక్కడుందో ఒకసారి చూద్దాం. మనదేశంలో ఆధార్ కార్డు మాదిరిగానే.. పాస్ పోర్ట్ కూడా ఆ దేశానికి చెందినవారు చెప్పే ప్రమాణ పత్రం. దీనిని ఆధారంగానే ప్రపంచంలోని ఏ దేశానికైనా వెళ్లడానికి అనుమతులు పొందగలరు. ప్రతి దేశంలోని పౌరులకు వారి దేశాల్లో పాస్ పోర్ట్ ఉంటుంది. దేశ సరిహద్దు దాటి వేరే దేశానికి వెళ్లాలంటే తప్పనిసరిగా పాస్ పోర్ట్ చూపించాల్సిందే. పాస్ పోర్ట్ మన దేశం నుంచి వచ్చే గుర్తింపు అయితే.. దీని ద్వారా వచ్చే వీసా మీరు వెళ్లాలనుకుంటున్న దేశం ఇచ్చే అనుమతి పత్రం.
2024 లో ఆరు దేశాల పాస్ పోర్టులు అత్యంత శక్తివంతమైనవిగా నిలిచాయి. వీటిలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ ఉన్నాయి. మంగళవారం విడుదలైన ‘ హేన్లీ పాస్ పోర్ట్ సూచీ’ నివేదికలో ఇవి తొలి స్థానంలో నిలిచాయి. 227 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ ది 80 వ స్థానం. తొలి స్థానంలో నిలిచిన ఆరు దేశాల పాస్ పోర్టులతో ఏకంగా 194 దేశాలకు ముందస్తు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. గత ఐదేళ్లుగా ఈ సూచీలో సింగపూర్, జపాన్ తొలి స్థానంలో నిలుస్తున్నాయి. ఈసారి అదనంగా మరో నాలుగు దేశాలు చేరడం విశేషం.
రెండో స్థానంలో ఉన్న దక్షిణ కొరియా, పిన్లాండ్, స్వీడన్ దేశాల పాస్ పోర్టులతో 193 దేశాలకు వెళ్లవచ్చు. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ పాస్ పోర్టులు మూడో స్థానంలో ఉన్నాయి. వీటితో 192 దేశాలకు వెళ్లేందుకు ముందస్తు వీసా అవసరం లేదు. 191 దేశాలకు ప్రయాణించే సౌకర్యం ఉన్న యూకే పాస్ పోర్ట్ నాలుగో స్థానం దక్కించుకుంది. 80వ స్థానంలో ఉన్న భారత్ పాస్ పోర్టుతో 62 దేశాలకు మాత్రమే ప్రయాణించవచ్చు. అయితే గత ఏడాది ఈ జాబితాలో ఇండియా 85వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఐదు స్థానాలను మెరుగుపరుచుకుంది.