Afghanistan Vs America: అమెరికా టారిఫ్ లు విధించినా.. హెచ్ వన్ బి వీసా ఫీజు ఏకంగా లక్ష డాలర్లకు పెంచినా.. భారత్ భయపడడం లేదు. రష్యా నుంచి ముడి చమురు కొనొద్దని ఆంక్షలు విధించినప్పటికీ భారత్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. పైగా సరికొత్త వాణిజ్య విధానంతో ముందుకు వెళ్తోంది. అమెరికా కాకుండా ఇతర దేశాలతో వ్యాపార సంబంధాలను పెంచుకుంటున్నది. ఎగుమతులను ఇతర దేశాలకు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నది. మేథో పరమైన వలసను పూర్తిగా నియంత్రించే పని చేపట్టాలని భావిస్తోంది.
వాస్తవానికి భారతదేశం నుంచి ఇటువంటి ప్రతిఘటనను అమెరికా ఊహించలేదు. మొదట్లో అక్రమంగా ఉంటున్నారని చాలామంది భారతీయులను అమెరికా ఇండియాకు తీసుకువచ్చింది. యుద్ధ ఖైదీల మాదిరిగా ప్రత్యేకమైన విమానాలలో తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టింది. ఆ తర్వాత టారిఫ్ లు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది సరిపోదని హెచ్ వన్ బీ వీసా ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. అసలే ఉద్యోగాలు పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న భారతీయులకు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం మరింత ఇబ్బంది కలగజేస్తోంది. ఇన్ని పరిణామాల మధ్య అమెరికా ప్రవర్తన.. తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత దారుణంగా ఉండడంతో ఏమీ చేయలేని పరిస్థితి.. అయినప్పటికీ భారత్ తన స్వీయ నిర్ణయాలు తీసుకుని స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నది. అంతేకాదు అమెరికాను పక్కనపెట్టి మరి ట్రేడ్ విషయంలో సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇండియా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు సరికొత్త దారిని చూపిస్తున్నాయి. ఇప్పుడు ఆ దారిలో ఆఫ్ఘనిస్తాన్ కూడా నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
మొన్నటిదాకా నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో దళాలు బయటికి వెళ్లిపోయిన తర్వాత.. ఆఫ్గనిస్తాన్ ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకున్నారు. పరిపాలన సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ ప్రాంతంలో బగ్రామ్ ఎయిర్ బేస్ ను తిరిగి తనకు అప్పగించాలని అమెరికా కోరుతోంది. ఇదే విషయాన్ని ఇటీవల ట్రంప్ వెల్లడించినట్టు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. ట్రంప్ డిమాండ్ ను తాలిబండ్ ప్రభుత్వం తోసి పుచ్చింది. అమెరికన్ ప్రభుత్వానికి గజం భూమి కూడా ఇచ్చేది లేదని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ స్పష్టం చేశారు. ” వారితో సంబంధాలు కొనసాగించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. అయితే వారికి మిలటరీ ఉనికిని చాటే ఎందుకు అనుమతి ఇవ్వమని” అమీర్ పేర్కొన్నారు. ఈ ఎయిర్ బేస్ చైనాకు దగ్గరగా ఉంటుంది. అందువల్లే ట్రంప్ ఈ ఎయిర్ బేస్ ను అడుగుతున్నట్టు తెలుస్తోంది.