India Vs Canada: భారత్, కెనడా మధ్య దౌత్య యుద్ధం తారాస్థాయికి..

ప్రస్తుతం ఢిల్లీలో కెనడాకు చెందిన 62 మంది దౌత్య సిబ్బంది ఉన్నారు. వారిలో 41 మందిని వెనక్కి పిలిపించుకోవాలని కెనడాకు భారత్ సూచించింది. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపైఇటు భారత్ నుంచి కానీ, అటు కెనడా నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు.

Written By: Dharma, Updated On : October 3, 2023 4:00 pm

India Vs Canada

Follow us on

India Vs Canada: ఇండియా, కెనడా మధ్య దౌత్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఖలిస్తాని ఉగ్రవాది హరదీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉందనడానికి తమ వద్ద విశ్వసనీయ సమాచారం వద్దని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ట్రూడో వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత దౌత్యవేత్తను బహిష్కరించడంతో.. దానికి బదులుగా కెనడా రాయబారిని న్యూఢిల్లీ బహిష్కరించింది.నిజ్జర్ హత్యపై కెనడా ఆరోపణల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా దారుణంగా దెబ్బతిన్నాయి.

ఈ తరుణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్లోని కెనడా దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని ఆదేశానికి కేంద్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మన దేశంలో ఉన్న కెనడా దౌత్యవేత్తల్లో 40 మందిని ఉపసంహరించుకోవాలని ఆ దేశానికి కేంద్రం తెలిపిందని ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. అక్టోబర్ 10లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించినట్లు సమాచారం. అప్పటికీ వారిని కొనసాగిస్తే మాత్రం భద్రతాపరంగా రక్షణ చర్యలు కల్పించమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఢిల్లీలో కెనడాకు చెందిన 62 మంది దౌత్య సిబ్బంది ఉన్నారు. వారిలో 41 మందిని వెనక్కి పిలిపించుకోవాలని కెనడాకు భారత్ సూచించింది. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపైఇటు భారత్ నుంచి కానీ, అటు కెనడా నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. కెనడాలో భారత దౌత్య సిబ్బందితో పోల్చుకుంటే… ఢిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య అధికం. భవిష్యత్తులో ఈ వివాదం ఇంకా ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి. మరోవైపు ఈ వివాదంలో ప్రపంచములో మెజారిటీ దేశాలు భారత్ కు మద్దతు పలుకుతుండడం విశేషం.