Thailand-Cambodia border dispute: థాయ్‌లాండ్, కంబోడియా దేశాల మధ్య సరిహద్దులో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. పురాతన ఆలయాల సమీపంలో ఉన్న భూభాగాలపై ఉన్నటువంటి వివాదం కారణంగా ఈ ఘర్షణలు తీవ్రమయ్యాయి. ల్యాండ్‌మైన్ పేలుళ్లు, ఫిరంగి కాల్పులు, వైమానిక దాడులు వంటి సంఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ప్రాణనష్టం జరగడంతో పాటు దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఐదుగురు థాయ్ సైనికులకు ల్యాండ్‌మైన్ పేలుడులో గాయాలు కావడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీనికి ప్రతీకారంగా థాయ్‌లాండ్ కంబోడియా రాయబారిని బహిష్కరించింది. అన్ని ఈశాన్య సరిహద్దులను క్లోజ్ చేసింది. కంబోడియా కూడా దౌత్య సంబంధాలను తగ్గించి, బ్యాంకాక్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేసింది. అప్పటి నుండి సురిన్, ఓడ్డర్ మీంచే ప్రావిన్సుల సరిహద్దుల్లో సైనిక దాడులు జరుగుతున్నాయని ప్రముఖ మీడియా నివేదించింది. థాయ్‌లాండ్కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం కంబోడియాలోని లక్ష్యాలపై వైమానిక దాడులు చేపట్టినట్లు పేర్కొంది.
ఈ ఘర్షణలు గురువారం తెల్లవారుజామున టా ముయెన్, టా మోన్ థోమ్ ఆలయాల సమీపంలో ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతాలు చాలా కాలంగా రెండు దేశాలు తమవని చెప్పుకుంటున్నాయి. థాయ్ సైన్యం ప్రకారం.. థాయ్ సైనికులు ఒక డ్రోన్‌ను, ఆ తర్వాత ఆరుగురు సాయుధ సైనికులు వస్తున్నట్లు గుర్తించిన తర్వాత కంబోడియా దళాలు ముందుగా కాల్పులు జరిపాయి. తమపై కాల్పులు జరిపిన తర్వాతే తాము ప్రతీకార చర్య తీసుకున్నామని థాయ్ పేర్కొంది. అయితే, థాయ్ దాడుల నుంచి తమ జాతీయ భూభాగాన్ని తమ దళాలు రక్షించుకుంటున్నాయని కంబోడియా పేర్కొంది.
Also Read: ఇక పై డ్రోన్లు కాదు.. బొద్దింకలే సైన్యం.. జర్మనీ సరికొత్త ప్లాన్
కంబోడియా నుండి జరిగిన ఫిరంగి కాల్పుల కారణంగా తొమ్మిది మంది థాయ్ లాండ్ పౌరులు మరణించారని, ఐదేళ్ల బాలుడితో సహా ముగ్గురు గాయపడ్డారని థాయ్ అధికారులు తెలిపారు. తమ ఏడుగురు సైనికులు కూడా గాయపడ్డారని థాయ్‌లాండ్ నివేదించింది. థాయ్ యుద్ధ విమానాలు కంబోడియా భూభాగంపై బాంబులు వేసి, భారీ ఆయుధాలను ఉపయోగించాయని కంబోడియా మంత్రిత్వశాఖ ఆరోపించింది. కంబోడియా ఫిరంగిదళం సురిన్ ప్రావిన్స్‌లోని ఫానోమ్ డోంగ్ రాక్ ఆసుపత్రిని టార్గెట్ గా చేసుకుంది. థాయ్‌లాండ్ అన్ని సరిహద్దు చెకింగ్ కేంద్రాలను కంబోడియాతో మూసివేసి, థాయ్ పౌరులు వీలైతే కంబోడియాను ఖాళీ చేయమని సూచించింది.
48 గంటల్లోపే, రెండు దేశాలు ఒకరి రాయబారిని ఒకరు బహిష్కరించాయి. కంబోడియా దౌత్య సంబంధాలను తగ్గించి, బ్యాంకాక్ రాయబార కార్యాలయం నుండి ఎక్కువ మంది సిబ్బందిని ఉపసంహరించుకుంది. ఈ సరిహద్దు వివాదం ముఖ్యంగా 1,000 సంవత్సరాల నాటిది. అక్కడ ఓ ఆలయం విషయంలో నెలకొంది. ఈ గొడవేం కొత్తది కాదు. అంతర్జాతీయ న్యాయస్థానం 1962లో ఈ ఆలయాన్ని కంబోడియాకు కేటాయించింది. అయితే థాయ్ జాతీయవాద గ్రూపులు ఈ తీర్పును నిరంతరం వివాదం చేస్తూనే ఉన్నాయి.