Asim Munir: పాకిస్తాన్.. మన దాయాది దేశం.. రాజకీయ అస్థిరతకు పెట్టింది పేరు. ప్రజాస్వామ్యం పేరుతో సైనిక పాలన కొనసాగించే దేశం ఇదే. 2025 చివరి నాటికి పాకిస్తాన్ రాజకీయాలు పూర్తిగా సైన్యం చేతుల్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఫీల్డ్ మార్షల్ పదవితో ఉన్న అసీమ్ మునీర్ ఇప్పుడు దేశంలోని అన్ని ప్రధాన నిర్ణయాల వెనుక ఉన్న వ్యక్తిగా నిలిచారు. అధికారికంగా సైనికాధిపతిగానే ఉన్నా, వాస్తవంగా ఆయన దేశ వ్యవస్థను నియంత్రిస్తున్న నిజమైన పాలకుడిగా పరిగణిస్తున్నారు.
సివిలియన్ ప్రభుత్వం.. సైన్యం ఆధిపత్యం
పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి ఇద్దరూ ‘‘ప్రముఖ సంస్థల మధ్య పరస్పర గౌరవం ఉంది’’ అని ప్రకటించగా, ఈ వ్యాఖ్యలు చరిత్రాత్మక అసమానతను మరింతగా బట్టబయలు చేస్తున్నాయి. పార్లమెంట్, అధ్యక్ష భవనం, న్యాయ వ్యవస్థ అన్నీ కూడా ఇప్పుడు రావల్పిండి జీఎచ్క్యూ అనుమతితోనే పనిచేస్తున్నాయి అనే అభిప్రాయం విశ్లేషకుల్లో బలంగా ఉంది.
చట్టాలలో ఆసిమ్ జోక్యం..
అసీమ్ మునీర్ పాలన కాలంలో పాకిస్తాన్ ఆర్మీ యాక్ట్, అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ లాంటి చట్టాల్లో విస్తృత మార్పులు జరిగాయి. ఇవి ప్రధానంగా వ్యతిరేక స్వరాలను అణచివేయడానికి ఆయుధాలుగా మారాయి. 2023, మే 9న జరిగిన హింసాత్మక నిరసనల తర్వాత వందల మంది పౌరులను సైనిక న్యాయస్థానాల్లో విచారణకు పంపడం మునీర్ ఆధిపత్యానికి నిదర్శనం. ఇది పాక్లో పౌర హక్కుల క్షీణతకు చిహ్నంగా అంతర్జాతీయ విమర్శలకు దారితీసింది.
పాలనా వ్యవహారాల్లోనూ..
మునీర్ నేతృత్వంలో మిలిటరీ అధికారులను వాపడా, నాద్రా వంటి పౌర సంస్థల్లో నియమించడం కొత్త పద్ధతిగా మారింది. దీని ద్వారా విద్యుత్ శాఖల నుంచీ జనాభా నమోదు వ్యవస్థల వరకు సైన్య ప్రభావం చాటుకుంది. ఈ సైనిక విస్తరణ వాస్తవానికి సివిల్ పాలనపై సంపూర్ణ పట్టు సాధించే వ్యూహంగా పరిగణించబడుతోంది.
రక్షణ వ్యయాలకు ప్రాధాన్యం..
2025లో మునీర్ ప్రభుత్వం రక్షణ ఖర్చులకు 20 శాతం పెంపు ప్రకటించగా, ఆరోగ్య, విద్య రంగాల బడ్జెట్ కోతలు పేద ప్రజల జీవితాలను మరింత కష్టతరం చేశాయి. ఇది సైన్య ప్రాధాన్యత ఎంతగా పెరిగిందో చూపిస్తుంది. దేశవ్యాప్తంగా పనిచేసే ప్రతి వ్యవస్థ ఇప్పుడు సైనిక ప్రయోజనాలకు తలొంచినట్లుంది.
పట్టు బిగిస్తున్న ఆర్మీ..
మునీర్ పాలనలో ఉగ్రవాద దాడులు పెరిగి, రెండు సంవత్సరాల్లోనే వందల మంది సైనికులు మరణించారని పాక్ రక్షణ వర్గాలు అంగీకరించాయి. అంటే సైన్య ఆధిపత్యం దేశ భద్రతను బలోపేతం చేయలేకపోయింది. దాని మూల్యం మరింత అస్థిరత, ప్రజా అసంతృప్తి రూపంలో బయటపడుతోంది. తాను దేశాన్ని కాపాడుతున్నానని చెప్పుకునే మునీర్, వాస్తవానికి పాకిస్తాన్ ప్రజాస్వామ్య మూలాలనే బలహీనపరుస్తున్నాడు. అని అంతర్జాతీయ విశ్లేషకులు తేల్చుతున్నారు.
ఫీల్ట్ మార్షన్ అసీమ్ మునీర్ పాలనలో పాకిస్తాన్ సైన్య ఆధిపత్యానికి పూర్తిగా లోనైన దేశంగా మారింది. పౌర సంస్థలు, మీడియా, న్యాయ వ్యవస్థలు అన్నీ ఆయన నియంత్రణలో ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి స్థానంలో సైనిక వ్యవస్థ ఆధారిత రాజ్య పాలన ఏర్పడుతోంది.