Cyber Crime: పోలీసులు ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ సైబర్ మోసాలు ఆగడం లేదు. పైగా సైబర్ నేరగాళ్లు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వినూతమైన విధానాలలో మోసాలకు పాల్పడుతున్నారు. నిన్నటి వరకు సాధారణ ప్రజలను నిండా ముంచిన సైబర్ నేరగాళ్లు ప్రజాప్రతినిధులను కూడా వదిలిపెట్టడం లేదు. ఏకంగా వారికి హెచ్చరికలు జారీ చేసి అడ్డగోలుగా దోపిడీ కి పాల్పడ్డారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
డిజిటల్ అరెస్టులను నమ్మకూడదని.. పోలీసులు అటువంటి వాటిని చేయరని.. దర్యాప్తు సంస్థలకు అటువంటి అధికారం లేదని పదేపదే చెబుతున్నప్పటికీ.. చాలామందికి వాటిపై అవగాహన ఉండడం లేదు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టులను తెరపైకి తీసుకొచ్చి మోసం చేస్తున్నారు.. ఏకంగా కోట్లను దండుకుంటున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు ఏపీలోని ఓ ఎమ్మెల్యే చేరిపోయారు. ఆయన ను డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు బెదిరించారు. ముంబై సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడుతున్నామని.. మీపై మనీలాండరింగ్ కేసులో అరెస్టు వారెంట్ జారీ అయిందని భయపెట్టారు. అదంతా నిజమే అనుకున్న ఆ ఎమ్మెల్యే ఏకంగా సైబర్ నేరగాళ్లు చెప్పిన ఖాతాలకు 1.7 కోట్లను బదిలీ చేశారు. ఆయనప్పటికీ ఆ ఎమ్మెల్యేను సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టకపోవడంతో.. మరో మార్గం లేక ఆ ఎమ్మెల్యే హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వాస్తవానికి ఆ ఎమ్మెల్యే కు సన్నిహితుల ద్వారా సైబర్ నేరగాళ్లు సమాచారాన్ని సేకరించారు. ఎమ్మెల్యే వ్యక్తిగత విషయాలను తెలుసుకొని ఆ దిశగా బెదిరింపులు మొదలుపెట్టారు. ఆయన స్థిరాస్తి వ్యాపారం, ఇతర వాటిల్లో పెట్టుబడులు పెట్టారు. అందులో కాస్త బ్లాక్ మనీ సర్కులేట్ అవుతూ ఉంటుంది. ఆయన ఆర్థిక లావాదేవీలు మొత్తం తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు.. వాటి ఆధారంగానే ఆయనను బెదిరించడం మొదలుపెట్టారు. మీ సంస్థల్లో మనీలాండరింగ్ ద్వారా డబ్బు ప్రవహించిందని.. ఆ ఆధారాలు మొత్తం తమ వద్ద ఉన్నాయని.. బెదిరించారు. అంతేకాదు లావాదేవీలను కూడా తేదీ లతో సహా చెప్పడంతో ఆ ఎమ్మెల్యే డిజిటల్ అరెస్ట్ నిజమేనని నమ్మారు. అంతేకాదు సైబర్ నేరగాళ్లు చెప్పినట్టుగా ఆయా ఖాతాలలో డబ్బులు వేశారు. అయితే ఆ ఖాతాల వివరాలను తెలుసుకోవడానికి ఎమ్మెల్యే ప్రయత్నించగా.. ఇతరుల పేర్లతో ఉన్నట్టు తెలిసింది. ఆ ఖాతాలు మొత్తం వేరే వాళ్ళవని.. సైబర్ నేరగాళ్లు తమ అవసరాల కోసం ఇతరుల ఖాతాలను వాడుకున్నట్టు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్ గా తీసుకున్నారు. ఆ ఎమ్మెల్యే డబ్బులు పంపించిన ఖాతాలను ప్రస్తుతానికి ఫ్రీజ్ చేశారు. తదుపరి దర్యాప్తుని కొనసాగిస్తున్నారు.