Syria Crisis: ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు మహమ్మద్ అష్రఫ్ ఘనీ ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొన్నారు. చివరికి తన పదవిని కోల్పోయారు. శ్రీలంక అధినేత గొటబాయ రాజపక్స కూడా ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. చివరికి అత్యంత అనామక స్థితిలో దేశం విడిచి వెళ్లిపోయారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం ఆదివారం సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. సిరియాలో ప్రజల తిరుగుబాటు గత నెల 27 నుంచి మొదలైంది. హయత్ తహ్రీర్ అల్ షమ్( హెచ్ టీ ఎస్) ఆధ్వర్యంలో రెబల్స్ పోరాటం చేస్తున్నారు. వారు శనివారం అలెపో, డెయిర్ ఎజోర్, అల్ కమల్, హోమ్స్, హమా నగరాలతో పాటు ఉత్తర సిరియాను మొత్తం ఆక్రమించారు. డమాస్కస్ అత్యంత చేరువగా వచ్చేశారు. ఆదివారం ఉదయం రాజధాని మొత్తాన్ని తమ ఆధీనులకు తెచ్చుకున్నారు. దీంతో ప్రజలు ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
ఐఎల్ -76 విమానంలో..
హెచ్ టీ ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం కావడం.. దేశ రాజధాని ఆధీనంలోకి తీసుకోవడంతో.. అసద్ కు అసలు సినిమా అర్థమైంది. వెంటనే అతడు తన కుటుంబంతో సహా రష్యా తయారు చేసిన ఐ ఎల్ 76 విమానంలో అత్యంత సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే ఆ విమానం నుంచి ఆదివారం మధ్యాహ్నం తర్వాత రాడార్ కు సంబంధాలు తెగిపోయాయని తెలుస్తోంది. దీంతో ఏదైనా ప్రమాదం జరిగి ఉండవచ్చని.. అసలు చనిపోయి ఉండవచ్చని సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని ఇంతవరకు సిరియా అధికారులు అధికారికంగా నిర్ధారించలేదు. అసద్ కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న విమానం 3650 మీటర్ల ఎత్తు నుంచి ఒక్కసారిగా 1070 మీటర్లకు పడిపోయిందని.. ప్రమాదం జరగడం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్లు నివేదిస్తున్నాయి. విమానం కూలిపోయిందని భావిస్తున్న ప్రాంతం లెబనాన్ గగనతలం పరిధిలో ఉందని వెబ్ సైట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు అత్యంత సురక్షిత ప్రాంతానికి వెళ్లే క్రమంలో రాడార్ కు అందకుండా అసద్ జాగ్రత్తలు తీసుకుని ఉంటాడనే విషయాన్ని కొట్టి పారేయలేమని విమానయాన రంగా నిపుణులు పేర్కొంటున్నారు..” అసద్ ఎక్కడున్నాడో తెలియదు. శనివారం రాత్రి నుంచే అతడి ఆచూకీ తెలియకుండా పోయింది. ప్రజలు ఎలాంటి నాయకత్వాన్ని ఆమోదిస్తారో తెలియదు. దానిని బట్టే సిరియా మనగడ ఆధారపడి ఉంటుంది. చూడాలి భవిష్యత్ కాలంలో ఏం జరుగుతుందోనని” మహమ్మద్ అల్ జలాలి వివరించారు.