
నల్ల సముద్రంపై ఆధిపత్యం కోసం కొనసాగుతున్న పోరాటం ఈ నాటిది కాదు. దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. రష్యా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, టర్కీ దేశాలు ఈ సముద్రంలో మెజారిటీ వాటా తమదేనంటూ పోరాటానికి దిగుతున్నాయి. తాజాగా.. బాంబులతో హెచ్చరించుకునే దాకా వెళ్లింది. క్రిమియా సముద్ర జలాల్లోకి వచ్చిన బ్రిటన్ నౌకలపై రష్యా హెచ్చరించడం.. ఇందుకు సూచిగా యుద్ధ విమానాలతో బాంబులు వేయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
ఈ ఘటనపై రష్యా వివరణ ఇస్తూ.. బ్రిటన్‌రాయల్ నేవీకి చెందిన డెస్ట్రాయర్ హెచ్ఎంఎస్ డిఫెండర్ ఇటీవల ఉక్రెయిన్ లోని ఒడిశా పోర్టుకు వెళ్లిందని, అక్కడి నుంచి జార్జియాకు వెళ్లే క్రమంలో క్రిమియా జలాల్లోకి ప్రవేశించిందని, దీన్ని గుర్తించిన తమ నౌకలు హెచ్చరికలు జారీచేస్తూ కాల్పులు జరిపినట్లు రష్యా తెలిపింది. యుద్ధ విమానాలతో నౌక సమీపంలో బాంబులు పేల్చినట్టు కూడా వెల్లడించింది.
రష్యా ప్రకటనపై బ్రిటన్ విభేదించింది. తాము ఉక్రెయిన్ జలాల్లోంచే ఇన్నోసెంట్ ప్యాసేజ్ నిర్వహించామని బ్రిటన్ రక్షణ మంత్రి తెలిపారు. ప్రధాని ప్రతినిధి కూడా మాట్లాడుతూ… ‘‘మా నౌకపై కాల్పులు జరిపామని చెప్పడం, మేము రష్యా జలాల్లోకి ప్రవేశించామని చెప్పడం కూడా అవాస్తవం’’ అని అన్నారు. ఈ ఘటనపై బ్రిటన్ ప్రభుత్వం తమదేశంలోని రష్యా రాయభారికి సమన్లు జారీ చేయగా.. రష్‌యా తమ దేశంలోని బ్రిటన్ రాయబారికి సమన్లు ఇచ్చింది.
రష్యా సోవియట్ యూనియన్ మనుగడలో ఉన్నప్పుడు ఉక్రెయిన్ కూడా అందులో భాగం. ఈ ఉక్రెయిన్ లో భాగంగా ఉన్న క్రిమియాను 2014 లో తిరిగి రష్యా స్వాధీనం చేసుకుంది. ఇది తమ ప్రాంతమేనని చెప్పింది. దీంతో.. పలు దేశాలు ఈ నిర్ణయంపై విభేదించాయి. ఇప్పుడు క్రిమియా సరిహద్దు జలాలుగా పరిగణించే సముద్రంలోకి బ్రిటన్ ఓడలు రావడం వల్లే బాంబులతో హెచ్చరికలు జారీచేయాల్సి వచ్చిందని రష్యా చెబుతోందన్నమాట. మరి, ఈ వివాదంలో ఇచ్చిన షోకాజ్ నోటీసులకు ఇరు దేశాలు ఎలాంటి సమాధానం ఇచ్చుకుంటాయో చూడాలి.