‘మా’ పోరు అసాధార‌ణం.. వర్గాలుగా నటులు!

ప్ర‌స్తుత కార్య‌వ‌ర్గం కాలం ఇంకా తీర‌నే లేదు. ఇంకా నోటిఫికేష‌న్ జారీనే కాలేదు. ఎప్పుడో సెప్టెంబ‌ర్లో జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు. కానీ.. రేపో మాపో అన్నంత హడావిడి చేస్తున్నారు! మ‌రోసారి హోరాహోరీ పోరు ఖాయ‌మ‌ని తేలిపోయిన‌ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు.. రోజురోజుకూ ర‌స‌వత్తరంగా మారుతున్నాయి. గ‌తంలో ఏక‌గ్రీవంగా సాగిన ఎన్నిక‌లు.. కొంత కాలంగా ప్ర‌త్య‌క్ష పోరుకు దారితీస్తున్నాయి. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న ఆధిప‌త్య పోరుకు ఇది నిద‌ర్శ‌న‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ద‌ఫా ముక్కోణ‌పు […]

Written By: Bhaskar, Updated On : June 25, 2021 8:51 pm
Follow us on

ప్ర‌స్తుత కార్య‌వ‌ర్గం కాలం ఇంకా తీర‌నే లేదు. ఇంకా నోటిఫికేష‌న్ జారీనే కాలేదు. ఎప్పుడో సెప్టెంబ‌ర్లో జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు. కానీ.. రేపో మాపో అన్నంత హడావిడి చేస్తున్నారు! మ‌రోసారి హోరాహోరీ పోరు ఖాయ‌మ‌ని తేలిపోయిన‌ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు.. రోజురోజుకూ ర‌స‌వత్తరంగా మారుతున్నాయి. గ‌తంలో ఏక‌గ్రీవంగా సాగిన ఎన్నిక‌లు.. కొంత కాలంగా ప్ర‌త్య‌క్ష పోరుకు దారితీస్తున్నాయి. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న ఆధిప‌త్య పోరుకు ఇది నిద‌ర్శ‌న‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ ద‌ఫా ముక్కోణ‌పు పోటీ ఖాయంగా క‌నిపిస్తుండ‌డం విశేషం. ఓ వైపు విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌. మ‌రోవైపు మంచు విష్ణు బ‌రిలోకి దిగ‌గా.. మ‌ధ్య‌లో తానూ ఉన్నానంటూ వ‌చ్చేశారు జీవిత‌. అయితే.. ఇందులో ప్ర‌కాష్ రాజ్ కు మెగా కాంపౌండ్ మ‌ద్ద‌తు ప‌లుతుండ‌గా.. మంచు విష్ణుకు కృష్ణ, కృష్ణం రాజు, బాల‌కృష్ణ స‌పోర్టుగా ఉన్నారు. దీంతో.. గెలుపు ఎవ‌రి ప‌క్షాన నిలుస్తుందోన‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది.

వాస్త‌వానికి ఇది కేవ‌లం పేద క‌ళాకారుల‌ను ఆదుకునేందుకు ఉద్దేశించిన సంస్థ‌. అయితే.. భారీగా నిధులు ఉండ‌డం.. మా అధ్య‌క్ష ప‌ద‌వి అనేది హోదాకు సింబ‌ల్ కావ‌డంతో.. చాలా మంది ఈ ప‌ద‌వుల‌ను ఆశిస్తున్నారు. ఈ పోటీ రాను రానూ మ‌రింత తీవ్రం కావ‌డంతో.. ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు మాట‌ల దాడులు కూడా కామ‌న్ అయిపోతున్నాయి. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ర‌చ్చ జ‌రిగింద‌ని అనుకుంటే.. ఈ సారి ప‌రిస్థితి మ‌రింత తీవ్రంగా ఉండే సూచ‌న‌లు మెండుగా క‌నిపిస్తున్నాయి.

ఇక‌, గెలుపే ప్ర‌ధాన‌మైన వేళ ఇప్ప‌టి నుంచే వాద ప్ర‌తివాద‌న‌లు మొద‌ల‌య్యాయి. లోక‌ల్‌- నాన్ లోక‌ల్ ఫీలింగ్ కూడా చూపిస్తున్నారు. క‌న్న‌డ న‌టుడిగా ఉన్న ప్ర‌కాష్ రాజ్‌.. తెలుగు ఇండ‌స్ట్రీలోని సంస్థను న‌డిపించ‌డ‌మేంట‌నే వాద‌న మొద‌లైంది. దీనికి ఆయ‌న మ‌ద్ద‌తుదారులు కూడా గ‌ట్టి కౌంట‌రే ఇస్తున్నారు. న‌డిపించే స‌త్తా కావాలే త‌ప్ప‌, ఎక్క‌డి వారైతే ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఆ మాట కొస్తే రాజ‌శేఖ‌ర్ త‌మిళుడు కాడా అని ప్ర‌శ్నిస్తున్నారు. అదేవిధంగా.. ఏ మాత్రం అనుభ‌వం లేని మంచు విష్ణు మా వంటి సంస్థ‌ను ఎలా న‌డ‌ప‌గ‌ల‌డు అని కౌంట‌ర్ వేస్తున్నారు. మొత్తానికి మూడు నెల‌ల ముందు నుంచే ఎన్నిక‌ల స‌మ‌రం మొద‌లు కావ‌డం.. ఇండ‌స్ట్రీలో నెల‌కొన్న కోల్డ్ వార్ ను చాటి చెబుతోంద‌ని అంటున్నారు. మ‌రి, ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో చూడాలి.