https://oktelugu.com/

Tu 160M White Swan: భారత్ కు తెల్లహంసలు వస్తున్నాయి.. ఇక పాక్, చైనాకు దబిడి దిబిడే..

పక్కలో బల్లెం లాగా చైనా... పంటికిందరాయిలాగా పాకిస్తాన్.. సంవత్సరాలుగా ఇదే పరిస్థితి.. సరిహద్దుల్లో నిత్యం ఏదో ఒక వివాదమే. ఏదో ఒక గొడవను రాజేయడం.. అశాంతిని కలిగించడం.. ఎప్పటికీ ఇదే పని..

Written By: Anabothula Bhaskar, Updated On : November 14, 2024 1:14 pm

Tu 160M White Swan

Follow us on

Tu 160M White Swan: మన దేశం మిగతా దేశాల సరిహద్దుల వద్ద భద్రతకు చేసే ఖర్చులో సింహభాగం చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వద్ద చేస్తోంది. దాదాపు వేలాదిమంది సైనికులను ఈ ప్రాంతంలో మోహరిస్తోంది. వారికోసం ప్రతి యేట వేలాదికోట్లు ఖర్చు చేస్తోంది. ఒకవేళ ఆదేశాలు కనుక మన మాదిరిగా శాంతి మంత్రాన్ని పాటించి ఉంటే మనకు ఇంతలా ఖర్చయ్యేది కాదు. ఆ డబ్బును ఇతర పనుల కోసం ఖర్చు పెడితే మన దేశం అని రంగాలలో అభివృద్ధి చెంది ఉండేది. చైనా, పాకిస్తాన్ దేశాలు నిత్యం మన దేశ సరిహద్దుల్లో ఏదో ఒక గొడవను సృష్టిస్తూనే ఉంటాయి. సరిహద్దు ను దాటి మనదేశంలోకి ప్రవేశించాలని భావిస్తూనే ఉంటాయి. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న జమ్మూ కాశ్మీర్లో నిత్యం ఏదో ఒక ఉగ్ర ఘాతుకం జరుగుతూనే ఉంటుంది. ఇక అరుణాచల్ ప్రదేశ్ లో భూభాగాలను తమవని చైనా పేర్కొంటూనే ఉంటుంది. గాల్వాన్ లోయ లాంటి ప్రాంతాలలో దూకుడు చర్యలు కొనసాగిస్తూనే ఉంటుంది. అయితే చైనా, పాకిస్తాన్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు భారత్ సిద్ధమవుతోంది. తన రక్షణ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునే ప్రణాళికను అమలు చేస్తోంది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు.. భారత్ మదిలో కోరికను ఇప్పుడు నెరవేర్చే పనిని రష్యా భుజాలకు ఎత్తుకుంది. శత్రుదేశాలపై పై చేయి సాధించేందుకు భారతదేశానికి “టీయూ -160 ఎం వైట్ స్వాన్” బాంబర్ యుద్ధ విమానాలను ఇవ్వనుంది.

ఎలా పనిచేస్తాయంటే..

“టీయూ -160 ఎం వైట్ స్వాన్” బాంబర్ యుద్ధ విమానాలకు పొడవైన రెక్కలుంటాయి. ఈ విమానాలను భారీ రన్ వే ల మీదుగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. వీటిని నడపడానికి పైలెట్లు, సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల భారతదేశానికి ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన రక్షణ వ్యవస్థ ఏర్పడుతుంది.. రష్యా వద్ద “టీయూ -160” యుద్ధ విమానాలున్నాయి. “టీయూ -160 ఎం వైట్ స్వాన్” బాంబర్ యుద్ధ విమానాలు వాటికి అడ్వాన్స్డ్ వెర్షన్. ఈ యుద్ధ విమానాలు ప్రపంచంలోనే వేగంగా ఎగురుతాయి. సూపర్ సోనిక్ యుద్ధ విమానం లాగా పరుగులు పెడతాయి. బరువైన పే లోడ్లను మోసుకెళ్తాయ్. ఇందులో నలుగురు సిబ్బంది కూర్చోడానికి అవకాశం ఉంటుంది. 12 లాంగ్ మిసైల్స్, 12 లాంగ్ టర్మ్ మిస్సైల్స్ ను ఇది మోసుకెళ్తుంది. ఇందులో నాలుగు ఇంజన్లు ఉంటాయి. ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 12,000 km వరకు పరుగులు పెడతాయి. గరిష్టంగా 16 వేల మీటర్ల ఎత్తులో ఎగురుతాయి. గంటకు 2,220 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో కొంతకాలంగా చైనా విన్యాసాలు చేస్తోంది. ఈ ప్రాంతం మీద పట్టు సాధించడానికి భారత్ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది.. రష్యా అందించే “టీయూ -160 ఎం వైట్ స్వాన్” బాంబర్ యుద్ధ విమానాల ద్వారా అది సాధ్యమవుతుందని భారత్ భావిస్తోంది. అయితే ఈ యుద్ధ విమానాలను భారత్ తీసుకుంటుందా? లేదా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.