Surya Kumar Yadav : ఈ మ్యాచ్ అద్యంతం ఉత్కంఠ గా సాగింది. రెండు జట్లు పోటాపోటీగా పరుగులు చేశాయి. రెండు జట్లు దూకుడుగా ఆడటంతో భారీగా పరుగులు నమోదయ్యాయి. టీమిండియా నుంచి తిలక్ వర్మ సెంచరీ చేస్తే.. దక్షిణాఫ్రికా నుంచి జాన్సన్ హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో టీం ఇండియా విజయం సాధించిన తర్వాత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఆటగాళ్లు మొత్తం సమష్టి చేశారని కొనియాడారు..” సంజు విఫలమయ్యాడు. నేను నిరాశపరిచాను. హార్దిక్ పాండ్యా మధ్యలోనే వచ్చేసాడు. రింకూ సత్తా చాట లేకపోయాడు. కానీ తిలక్ వర్మ జట్టు భారాన్ని మోసాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడని” సూర్య పేర్కొన్నాడు..” రెండో టి20 మ్యాచ్లో మేము ఓడిపోయాం. ఫలితంగా సిరీస్ 1-1 తేడాతో సమమైంది. ఆ సమయంలో మాపై ఒత్తిడి ఉంది. దీంతో నా రూమ్ లోకి తిలక్ వర్మ వచ్చాడు. మూడవ టి20 లో వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వస్తానని పేర్కొన్నాడు. నాకు అవకాశం ఇచ్చి చూడండి నన్ను నిరూపించుకుంటానని చెప్పాడు. దానికి నేను ఓకే అన్నాను. అడిగిమరీ అవకాశం తీసుకున్నాడు. అలాగే అదరగొట్టాడు. ఏకంగా సెంచరీ చేసి వారెవా అంపించాడు.. సెంచరీ చేయడం ద్వారా తిలక్ ఆనందంలో తేలియాడుతున్నాడు. అతని కుటుంబం సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా విజయం సాధించడం గొప్పగా అనిపిస్తోందని” సూర్య కుమార్ యాదవ్ పేర్కొన్నాడు.
నిరాశపరచలేదు
దక్షిణాఫ్రికా జరుగుతున్న సిరీస్లో తిలక్ వర్మ ఇంతవరకు నిరాశపరచలేదు. తొలి మ్యాచ్లో 30కి పైగా పరుగులు చేసిన అతడు.. రెండో మ్యాచ్లో 20 పరుగులు చేశాడు. మూడో మ్యాచ్లో సెంచరీ చేశాడు. ప్రస్తుతం ఈ సిరీస్లో టీమిండియా తరఫున లీడింగ్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. సెంచరీ అనంతరం తిలక్ వర్మ ఉద్వేగంగా వ్యాఖ్యానించాడు..” మ్యాచ్ గెలవడం గొప్పగా అనిపించింది. ఇది సెంచరీ కంటే కూడా ఆనందంగా ఉంది. దేశం కోసం ఇలా ఆడటం నాకు మొదటినుంచి ఒక కల. ఇప్పుడు అది నెరవేరింది. సూర్య కుమార్ యాదవ్ ప్రోత్సాహం వల్ల వన్ డౌన్ లో వచ్చాను. నా బాధ్యతను నిర్వర్తించానని” తిలక్ వర్మ వ్యాఖ్యానించాడు. 22 సంవత్సరాల నాలుగు రోజుల వయసులో సెంచరీ చేసి.. టి20 ఇంటర్నేషనల్ భారత తరఫున అత్యంత చిన్న వయసులో సెంచరీ చేసిన రెండవ ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డు సృష్టించాడు. 21 సంవత్సరాల 279 రోజుల్లో నేపాల్ జట్టుపై సెంచరీ చేసి యశస్వి జైస్వాల్ ఈ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.