Donald Trump: ట్రంప్‌కు షాక్‌ ఇచ్చిన రష్యా… ఎన్నికల్లో మద్దతుపై క్లారిటీ..!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో మూడు నెలల్లో జరుగనున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ప్రధానంగా అధికార డెమొక్రటిక్‌ పార్టీ, విపక్ష రిపబ్లికన్‌ పార్టీ మధ్యనే పోటీ నెలకొంది.

Written By: Raj Shekar, Updated On : September 2, 2024 12:34 pm

Donald Trump

Follow us on

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌లో జరుగనున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికలకు గడువు తక్కువగా ఉండడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారం స్పీడ్‌ పెంచారు. ర్యాలీలు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ ఒక అడుగు ముందుకేసి తనను గెలిపిస్తే ఉచితంగా ఐవీఎఫ్‌ చికిత్స అందిస్తానని తెలిపారు. ఇక ప్రచారం జోరుగా సాగుతుండగా, ప్రీపోల్‌ సర్వేలు కూడా జోరందుకున్నాయి. సర్వే ఫలితాల్లో ప్రధాన పోటీ అధికార డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యనే నెలకొంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారం జోరు పెంచారు. ఇక అమెరికాలోని వివిధ దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారు కూడా ఇప్పటికే తమ మద్దతు ఎవరికో డిసైడ్‌ అయ్యార్థు. భారతీయులు ఎక్కువగా కమలా వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు కుబేరుడు ఎలాన్‌ మస్క్, మెటా సీఈవో మార్క్‌ జూకర్‌బర్గ్‌ ట్రంప్‌నకు మద్దతు తెలిపారు. ఈ తరుణంలో అమెరికా శత్రుదేశం రష్యా తన మద్దతుపై క్లారిటీ ఇచ్చింది.

ఆశ్చర్యపర్చిన రష్యా నిర్ణయం..
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా తాజా వైఖరి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రతీ విషయంలో పుతిన్‌ను సమర్థించే రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌వైపు కాకుండా డెమోక్రాట్‌ అభ్యర్థి కమలాహారిస్‌కు రష్యా మద్దతు తెలుపుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే విషయమై తాజాగా ఓ టీవీ చానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష పోరులో తలపడుతున్న అభ్యర్థుల్లో ట్రంప్‌ కంటే కమలాహారిసే అంచనా వేయదగ్గ వ్యక్తని చెప్పారు. అయితే తాము ఎవరికీ మద్దతివ్వడం లేదని స్పష్టం చేశారు.

ఆ దేశ అంతర్గత వ్యవహారం..
ఎన్నికలు పూర్తిగా అమెరికా అంతర్గత వ్యవహారమని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే రష్యా, ఉక్రెయిన్‌ సమస్య పరిష్కరిస్తామని ట్రంప్‌ ఇస్తున్న హామీని పెస్కోప్‌ కొట్టిపారేశారు. రష్యా, ఉక్రెయిన్‌ సమస్య పరిష్కరించేందుకు ట్రంప్‌ దగ్గర మంత్రదండమేమీ లేదని పేర్కొన్నారు. కాగా, గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భిన్న అభిప్రాయాలు వెలిబుచ్చారు. ట్రంప్‌ కంటే బైడెనే బెటరని ఓసారి, ట్రంప్‌ కోర్టులను అడ్డుపెట్టుకుని అధ్యక్ష ఎన్నికల్లో ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని భిన్న వ్యాఖ్యలు చేశారు.