YS Jagan Sakshi Newspaper : కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడంపై సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాన్ని తీవ్రంగా ఖండించిన వైఎస్ షర్మిల.. జగన్, వైసీపీ నాయకత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఒక మహిళగా తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనం రాశారని మండిపడ్డారు. గతంలో వైఎస్సార్ కూడా చంద్రబాబును కుటుంబ వేడుకలకు ఆహ్వానించారని గుర్తుచేస్తూ వైసీపీకి పలు ప్రశ్నలు సంధించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైఎస్ కుటుంబం చుట్టూ వివాదం రాజుకుంది. వైఎస్ షర్మిల కుమార్తె వివాహ ఆహ్వానం ఇప్పుడు రాజకీయ విమర్శలకు కేంద్రబిందువైంది. తన కుమార్తె పెళ్లికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడాన్ని ప్రస్తావిస్తూ సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై షర్మిల తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ కథనం తన వ్యక్తిత్వంతో పాటు తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెళ్లి పిలుపులోనూ రాజకీయ కోణమా?
కుటుంబంలో జరిగే శుభకార్యాలకు రాజకీయ నాయకులను ఆహ్వానించడం సాధారణమైన విషయమే. అయితే తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించడాన్ని కూడా రాజకీయ కోణంలో విశ్లేషిస్తూ, వ్యక్తిగత సంబంధాలకు తప్పుడు అర్థాలు ఆపాదించడం ఏమిటని షర్మిల ప్రశ్నించారు.
తండ్రి వయసున్న వ్యక్తికి వివాహ ఆహ్వాన పత్రిక అందిస్తే చెట్టాపట్టాలంటూ కథనాలు రాయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఒక ఆడబిడ్డపై ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సమాజంలో విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.
జగన్, వైసీపీపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
ఈ వ్యవహారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు షర్మిల. మహిళల పట్ల గౌరవం ఉందని చెప్పుకునే పార్టీ, తనకు సంబంధించిన విషయంలో మాత్రం ఇలాంటి కథనాలను ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు.
తనపై, తన కుటుంబంపై వ్యక్తిత్వ హననం జరిగేలా కథనం ప్రచురించారని ఆరోపించారు. మహిళలపై తప్పుడు ప్రచారం చేయడం, వ్యక్తిగత సంబంధాలకు వక్రభాష్యాలు చెప్పడం వైసీపీ రాజకీయ సంస్కృతిగా మారిందంటూ విమర్శించారు.
వైఎస్సార్ గతాన్ని గుర్తుచేసిన షర్మిల
తన వాదనకు బలం చేకూర్చేలా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడిని కుటుంబ వివాహ వేడుకలకు ఆహ్వానించిన విషయాన్ని షర్మిల ప్రస్తావించారు.
రాజకీయంగా ప్రత్యర్థులైనప్పటికీ వ్యక్తిగతంగా కుటుంబ సంబంధాలు, ఆత్మీయతలు కొనసాగడం సహజమని ఆమె అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ కూడా చంద్రబాబును తన పిల్లల వివాహాలకు ఆహ్వానించారని, అలాంటప్పుడు ఆయనకు చంద్రబాబుతో ప్రత్యేక సంబంధాలు అంటగడతారా? అని ప్రశ్నించారు.
రాజకీయ విభేదాలను వ్యక్తిగత జీవితాల్లోకి తీసుకురావడం సరికాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సాక్షి వివరణ ఇవ్వాలంటూ డిమాండ్
ఈ కథనానికి సంబంధించి జగన్‌తో పాటు సాక్షి యాజమాన్యం కూడా సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఒక మహిళ వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా కథనాలు రాయడం పత్రికా ధర్మమా? అని ప్రశ్నించారు.
తనపై వచ్చిన కథనానికి సాక్షి వివరణ ఇస్తుందా? లేక జగన్ స్వయంగా స్పందిస్తారా? అని నిలదీశారు.
మొత్తానికి, కుమార్తె వివాహ ఆహ్వానంతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు జగన్, షర్మిల మధ్య రాజకీయ విమర్శలకు మరో వేదికగా మారింది. కుటుంబ సంబంధాలు, రాజకీయ విభేదాలు, మీడియా కథనాల చుట్టూ సాగుతున్న ఈ మాటల యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ?
నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట.
@ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు.
ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే… సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ?
నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే
రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది.ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ?
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి.
ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
— YS Sharmila (@realyssharmila) November 17, 2026